సమగ్ర సంస్కరణలు చేపట్టకపోవడం వల్ల ఐక్యరాజ్య సమితి తన విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితికి చేరుకుందని పేర్కొన్నారు ప్రధాని నరేంద్రమోదీ. ఐక్యరాజ్య సమితి(ఐరాస) 75వ సాదారణ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన మోదీ.. ఐరాసలో జరిగే సంస్కరణలు బహుముఖమైనవి కావాలని ఆకాంక్షించారు. అప్పుడే భాగస్వామ్య దేశాలు తమ గళాన్ని సమర్థంగా వినిపించి.. సమస్యలు పరిష్కరించుకోవడం ద్వారా ప్రపంచ మానవాళి అభివృద్ధికి దోహదం చేసినట్లు అవుతుందని మోదీ వివరించారు.
తొలిసారి రికార్డు చేసి..
ఐక్యరాజ్యమితి 75వ సాధారణ సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్రమోదీ తొలి ప్రసంగం చేశారు. కొవిడ్ నిబంధనల మధ్య చరిత్రలో ఎన్నడూలేని విధంగా దృశ్యమాధ్యమం ద్వారా ఈ సమావేశం జరిగింది. ఇందుకోసం ముందుగానే రికార్డు చేసి మోదీ తన సందేశాన్ని పంపారు.
ఈ ప్రసంగం ద్వారా ఐక్యరాజ్యమితిలో సంస్కరణలు అత్యావశ్యకమని ప్రధాని మరోసారి నొక్కిచెప్పారు. 2021, జనవరి 1 నుంచి రెండేళ్ల పాటు.. శక్తిమంతమైన ఐరాస భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా భారత్ ఉండనుంది. ఈ నేపథ్యంలో మోదీ చేసిన ప్రసంగం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటివరకు ఐక్యరాజ్యసమితి ఎన్నో విజయాలు సాధించినప్పటికీ.. అసలైన లక్ష్యానికి మాత్రం ఆమడదూరంలోనే నిలిచిందని మోదీ అభిప్రాయపడ్డారు.
లక్ష్యాలకు దూరం..
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సవాళ్ల పరిష్కారానికి, ప్రపంచదేశాల అభివృద్ధికి ఇంకా ఎంతో చేయాల్సి ఉందని, వాతావరణ మార్పుల విషయంలో కూడా ఇంకా అనుకున్న లక్ష్యానికి చేరువ కాలేదని చెప్పారు మోదీ. ఇదంతా జరగాలంటే ఐక్యరాజ్యమితిలో పాత విధానాలకు స్వస్తి చెప్పి నూతన సంస్కరణలకు మొగ్గతొడగాల్సిన సమయం ఆసన్నమైందని మోదీ స్పష్టం చేశారు. ఇలా జరగని పక్షంలో ఐక్యరాజ్యమితి తన విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. ఐక్యరాజ్యమితి కారణంగానే నేడు ప్రపంచంలో శాంతి పరిఢవిల్లుతోందని.. అయితే 1945లో ఏర్పాటైన ఈ సంస్థ సమకాలీన పరిస్థితులకి తగ్గట్లు మారాల్సిందేనన్నారు.
''ఐక్యరాజ్యమితిలో సంస్కరణలు తప్పనిసరి అన్న విషయం స్పష్టం అవుతోంది. పాత విధానాలతో కూడిన వ్యవస్థలతో పెద్దపెద్ద సవాళ్లను మనం ఎదుర్కోలేము. సమగ్రమైన సంస్కరణలు చేపట్టకపోతే.. ఐక్యరాజ్యసమితి తన విశ్వాసాన్ని కోల్పోయే ముప్పు పొంచి ఉంది. ప్రపంచదేశాలన్నీ అనుసంధానమై ఉన్న ప్రస్తుత సమయంలో బహుముఖమైన సంస్కరణలు అత్యావశ్యకం. ఆ సంస్కరణలు ఇవాళ్టి ప్రపంచానికి ప్రాతినిధ్యం వహిస్తాయి. భాగస్వాములైన ప్రతి ఒక్కరి గళాన్ని సమర్థంగా వినిపించే వీలు కల్పిస్తాయి.