తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గాంధీ 150: మహాత్ముని జీవనమే సంస్కరణ - సహాయ నిరాకరణ

ఆశ్రమాలు... మహాత్మ గాంధీ జీవితంలో ముఖ్య భాగాలు. ఆశ్రమాలకు ఎందుకంత ప్రాధాన్యం? ధర్నాలు, ప్రదర్శనలు, హర్తాళ్లు, సమ్మెలు, సహాయ నిరాకరణ, పన్నుల నిరాకరణ వంటి ఉద్యమాలు చేస్తే స్వాతంత్ర్యం వస్తుంది కదా. ఈ ఆశ్రమ జీవితాలు, నియమ నిష్టలు, ప్రతిజ్ఞలు ఎందుకు?

మహాత్ముని జీవనమే సంస్కరణ

By

Published : Aug 20, 2019, 7:01 AM IST

Updated : Sep 27, 2019, 2:51 PM IST

అది 1925 నవంబర్‌. సబర్మతి సత్యాగ్రహ ఆశ్రమంలో కొందరు కుర్రాళ్ల అనైతిక చేష్టలకు నిరసనగా బాపూ వారం రోజులు నిరాహార దీక్ష ప్రకటించారు. 'నా చావుకు మీరు కారకులు కాకండి' అన్నారు గాంధీజీ ఆశ్రమ వాసులతో. అంతే ఒక్కసారిగా అలజడి. తప్పు చేసిన యువకులు మహాత్ముని వద్దకు వచ్చి తమ తప్పు ఒప్పుకుని పశ్చాత్తాపం ప్రకటించారు. అదీ గాంధీజీ నైతిక శక్తి.

గాంధీజీ దక్షిణాఫ్రికా, భారత్‌లో నాలుగు ఆశ్రమాలు నిర్మించారు. దక్షిణాఫ్రికాలో ఫీనిక్స్‌, టాల్‌స్ట్రాయ్‌, మన దేశంలో సత్యాగ్రహ (సబర్మతి), వార్థా సేవాగ్రాం ఆశ్రమాలవి. వాస్తవానికి ఇవి ఆశ్రమాలు కాదు.. సామాజిక ప్రయోగశాలలు.

చాలా మంది గాంధీజీని ఒక స్వాతంత్ర్య సమరయోధునిగా మాత్రమే చూస్తారు. జాతిపిత అంటారు. అయితే ఇతర రాజకీయ ఉద్ధండులకు భిన్నంగా బాపూజీ ప్రత్యామ్నాయ సమాజాన్ని, జీవన విధానాన్ని, సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ఆచరించి చూపిన ప్రవక్త. గొప్ప మాటలు చెబుతూ ఆచరణలో తత్‌విరుద్ధంగా జీవించే అనేక మంది చరిత్రకాలం నుంచి నేటి కాలం వరకు అనేక మంది మనకు తారసిల్లుతుంటారు. బాపూజీ తాను ప్రవచించిన దానికన్నా ఆచరణలో మరింత ఉన్నతంగా కనబడతారు.

అన్నింటికన్నా ముఖ్యమైనది మన లక్ష్యం ఎంత ఉన్నతమైనదో అందుకు చేరుకునే మార్గం కూడా అంతే ఉత్తమమైనదిగా ఉండాలంటారు మహాత్ముడు. గాంధీజీ ఆశ్రమాలు ప్రత్యామ్నాయ జీవన విధాన ప్రయోగశాలలు. మహోన్నత మానవుల్ని తయారుచేసే కార్ఖానాలు.

సమానత్వమే పునాది...

పూర్వం మహర్షులు మోక్ష సాధనకు తపస్సు, ఆశ్రమ జీవన విధానాన్ని ఎంచుకునేవారు. బాపూజీ అందుకు భిన్నమైన రాజకీయ రుషి. అహింసాయుత సత్యాగ్రహ పోరాటానికి.. కొత్త సమాజ నిర్మాణానికి అవసరమైన నూతన మానవుని ఆవిష్కరణే ఆశ్రమ లక్ష్యం. ఆశ్రమంలోని సభ్యులందరూ సమానులే. కుల, మత, దేశ, భాషల తేడాలు ఉండవు. ఆశ్రమ వాసులందరూ అన్ని పనులు... అంటే వంట పని దగ్గర నుంచి మరుగుదొడ్లు శుభ్రం చేయడం వరకు అన్నీ చేయాలి, చేస్తారు. ఆశ్రమ వాసులు 11 నియమాలు పాటించాలి. సత్యవచనం, అహింస, బ్రహ్మచర్యం, జిహ్వ చాపల్యాన్ని అదుపులో ఉంచుకోవడం, అపరిగ్రహణం(సొంతానికి ఏమీ ఉంచుకోకపోవడం), ఆస్థేరు (తనది కానిదేదీ ఆశించకుండా ఉండడం- చోరరహిత జీవనం), శారీరక శ్రమ, నిర్భీతి, సర్వధర్మ సమ్మతి, స్వదేశీ, అంటరానితనం నిర్మూలన.

ధర్నాలు, ప్రదర్శనలు, హర్తాళ్లు, సమ్మెలు, సహాయ నిరాకరణ, పన్నుల నిరాకరణ వంటి ఉద్యమాలు చేస్తే స్వాతంత్ర్యం వస్తుంది కదా. ఈ ఆశ్రమ జీవితాలు, నియమ నిష్టలు, ప్రతిజ్ఞలు ఎందుకు? ఎందుకంటే గాంధీజీ దృష్టిలో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినంత మాత్రాన చాలదు. మనిషి స్వతంత్రంగా జీవించగలగాలి. ఆ జీవితానికి ఒక దృక్పథం కావాలి, అర్థం, పరమార్థం ఉండాలి. అది ప్రకృతిని విధ్వంసం చేసేది కాకుండా... ప్రకృతితో సహజీవనం చేసేదిగా ఉండాలి.

ఆశ్రమాలే ప్రయోగశాలలు...

మన సమాజంలోని కుల, మత ద్వేషాలు, స్వార్థం, మితిమీరిన వస్తు వ్యామోహం, హింసా ప్రవృత్తి, లైంగిక వివక్ష వంటి ధోరణులన్నీ అప్పుడూ ఉన్నాయి.. నేటికీ కొనసాగుతున్నాయి. నిజానికి ఇప్పుడు మితిమీరి విజృంభిస్తున్నాయి కూడా! అందువల్లనే మహాత్ముడు మనిషిని మనిషిగా... మహోన్నత మానవుడిగా మార్చాలని సంకల్పించాడు. ఈ ప్రక్రియలో గాంధీజీకి ఆశ్రమాలే ప్రయోగశాలలు.

బాపూజీ ఆశ్రమాలు సొంత ప్రయోగాలు చేస్తాయి. సహాయ నిరాకరణ, అహింసాయుత... మనిషిని... మనీషిగా తీర్చిదిద్దుతాయి. బాపూజీ ఆశ్రమాలు 'సత్యం'తో చేసే ప్రయోగాలు పోరాటాలకుసత్యాగ్రహుల్ని తయారుచేస్తాయి.

వారికి ఆర్థిక, నైతిక మద్దతునిస్తాయి, ఇచ్చాయి. అన్నింటికన్నా ముఖ్యమైనది ఉద్యమకారులు సమాజ పునర్నిర్మాణ కార్యక్రమాల్లో తప్పనిసరిగా పాల్గొనాలి.

గాంధీజీకే సహాయ నిరాకరణ...

భారత దేశంలోని ప్రత్యేకతైన కుల వ్యవస్థ... నిచ్చెనమెట్ల సమాజాన్ని నిర్మించింది. తరతరాలుగా దళితుల్ని అంటరానివారిగా దూరం పెట్టింది. గాంధీజీ నిర్మాణ కార్యక్రమాల్లో అతిముఖ్యమైనది అంటరానితనం, నిర్మూలన. సబర్మతి ఆశ్రమానికి తొలిసారి ఒక దళిత దంపతులకు ప్రవేశం లభించినపుడు బాపూజీకి... కస్తూర్బా నుంచి మొదలుపెట్టి అనేకుల నుంచి విపరీతమైన నిరసన వ్యక్తమైంది. ఆశ్రమ వాసులకు జుత్తు కత్తిరించేందుకు క్షురకులు నిరాకరించగా గాంధీజీయే ఆ పని నేర్చుకున్నారు. బాపూజీకి కస్తూర్బా నిధులు ఆగిపోయాయి. అయినప్పటికీ గాంధీజీ తన ఆశయాన్ని సడలించలేదు. ఆ రోజుల్లో దళితులతో సహజీవనం (హరిజన అనేవారు) ఎంతో విప్లవాత్మక చర్య.

మతాల మధ్య చిచ్చుపెట్టి, విభజించి పాలించే పాలకవర్గాలు ఎప్పుడూ ఉంటుంటాయి. బ్రిటీష్‌ వారు అదే పని చేశారు. దీనికి ప్రతిగా గాంధీజీ అన్ని మతాలవారితో సహజీవనాన్ని బోధించారు, ఆచరించారు. ఆశ్రమంలో రోజూ అన్ని మతాల ప్రార్థనలు చదువుతారు. ఆ తర్వాత బాపూ ప్రవచనం ఉంటుంది. టాల్‌స్ట్రాయ్‌ ఫాం అయినా, సత్యాగ్రహ (సబర్మతి) ఆశ్రమమైనా.. అందరు సభ్యులు రోజూ శారీరక శ్రమ చేయాలి.

స్వయం సమృద్ధతే ప్రత్యేకత..

ఆశ్రమవాసులకు కావాల్సిన కూరగాయలు, పండ్ల తోటలు అక్కడే పెంచేవారు. చెప్పులు కుట్టడం, కార్పెంటరీ, బెల్లం తయారీ వంటి కుటీర పరిశ్రమలు చేపట్టేవారు. మేధోపరమైన శ్రమజీవులు - శారీరక శ్రమ చేసేవారు.. ఇరువురూ సమానులే అని బాపూ చెప్పేవారు. అలాగే సమాన వేతనం ఇచ్చేవారు. రాట్నం ఒడకడం వల్ల ప్రతి ఒక్కరికీ ఆర్థిక స్వావలంబన లభిస్తుందని బాపూ చెప్పేవారు. అందరూ సులభంగా నూలు ఒడకడానికి వీలైన చరఖా తయారీకి ఆనాడే లక్ష రూపాయల బహుమతితో దేశవ్యాప్తంగా పోటీలు నిర్వహించారాయన.

ఆదర్శం... ఆచరణ

దక్షిణాఫ్రికాలోని గాంధీ ఆశ్రమంలోని ఒకరికి లండన్‌లో చదువుకునేందుకు అవసరమైన ధన సహాయం విరాళంగా లభించింది. బాపూ పెద్ద కుమారుడు హరిలాల్‌కు లండన్‌లో విద్యాభ్యాసం చేయాలని కోరిక. అయితే గాంధీజీ ఆశ్రమవాసి అయిన వేరే బాలుడికి అవకాశాన్ని ఇస్తారు. దీన్ని మనసులో పెట్టుకుని హరిలాల్‌ జీవితాంతం తండ్రి పట్ల ద్వేషం పెంచుకున్నారు. నా కుమారుడనే బంధుప్రీతి చూపకూడదు అనేది గాంధీజీ నియమం. దాన్ని చెప్పటమే కాదు.. జీవితాచరణతో చూపారు.

దక్షిణాఫ్రికా, భారతదేశంలో జరిగిన సత్యాగ్రహ ఉద్యమాల్లో గాంధీజీ ఆశ్రమాలు కీలకపాత్ర పోషించాయి. ఉద్యమకారులను తయారుచేశాయి. స్ఫూర్తినిచ్చాయి. మహాత్ముని ఆశ్రమాల్లోని నివాసులు అందరూ అన్ని పండుగలు కలిసి చేసుకునేవారు. దక్షిణాఫ్రికాలోనూ, ఇండియాలోనూ మహాత్ముని స్ఫూర్తితో ఎందరో ముస్లింలు సత్యాగ్రహ కార్యకర్తలయ్యారు. ఖాన్‌ అబ్దుల్‌ గఫార్‌ ఖాన్‌ సరిహద్దు గాంధీగా పేరుగాంచారు.

మహిళా సాధికారతకు శ్రీకారం...

బాల్య వివాహాలను గాంధీజీ వ్యతిరేకించారు. ఆశ్రమాల్లోనూ, జాతీయ ఉద్యమంలోనూ ఆనాడు పర్దా వెనుక జీవించే మహిళలను మహాత్ముడు మాతృభాష, జాతీయోద్యమంలో పాల్గొనేలా ఉత్తేజితులను చేశారు. పెద్ద సంఖ్యలో ప్రజా జీవితంలో వారు పాల్గొనేలా ఆయన ప్రోత్సహించారు. మహాత్ముని మాతృభాష, వ్యక్తిత్వ నిర్మాణం ప్రాధామ్యాలుగా ఒక కొత్త విద్యా విధానాన్ని అమలు చేశారు. ఆడపిల్లలు, మగపిల్లలు విడివిడిగా కాకుండా ఆనాడే కలగలిసి క్లాసులో కూర్చుని చదువుకునే పద్ధతి ఆశ్రమాల్లో అమలు చేశారు.

ఇదీ చూడండి:'మహాత్ముడి కలల భారతాన్ని నిర్మించామా?

బ్రహ్మచర్య నియమం, ఆధునికత వంటి విషయాల్లో బాపూ ఛాందసుడని కొందరు ప్రచారం చేస్తుంటారు. అది అసత్యం. ఆశ్రమ విద్యార్థులకు చదువు చెప్పేందుకు కొందరు అధ్యాపక కుటుంబాలను బాపూ ఆహ్వానించారు. వారికి బ్రహ్మచర్య నియమం సడలించారు. అలాగే తీవ్ర రుగ్మతతో చావు, బతుకుల మధ్య నరకం అనుభవిస్తున్న జంతువుకు విషపు ఇంజక్షన్‌ ఇచ్చి విముక్తి కల్పించేందుకు బాపూ అంగీకరించారు.

ఆ రోజుల్లోనే ఇదొక విప్లవాత్మకమైన చర్య. మనిషిని బానిసలుగా చేయడం కాకుండా అన్ని చేతులకు పని కల్పించే మంత్రాలను ఆయన ఆహ్వానించేవారు. పెట్టుబడిదారి దోపిడీకి భిన్నంగా సహకార ఆర్థిక వ్యవస్థను మహాత్ముడు ఆకాంక్షించాడు.

బ్రిటీషర్లకూ ఆశ్రయం...

ఆశ్రమం ప్రజల ఆస్తి. ఎప్పుడైనా ఎవరైనా రావచ్చు, చూడవచ్చు, జీవించవచ్చు. బ్రిటీష్‌ సైనిక అధికారి కుమార్తె మీరాబెన్‌గా ప్రసిద్ధికెక్కి మేడలిన్‌ స్లేడ్‌ గాంధీజీ శిష్యురాలిగా ఆశ్రమంలో జీవించింది.

ఆశ్రమంలో అందరికీ ఒకటే వంటశాల, ఒకే తరహా భోజనం లభిస్తుంది. ఆశ్రమవాసులెవ్వరికీ సొంత ఆస్తి అంటూ ఉండదు. కులాంతర వివాహాలను ఆయన ప్రోత్సహించారు. అటువంటి పెళ్లిళ్లకే హాజరయ్యేవారు. సిద్ధాంతాలు లేని రాజకీయాలు, శ్రమ లేని సంపద, వివేకం లేని సుఖం, వ్యక్తిత్వం లేని జ్ఞానం, నైతిక విలువలు లేని వ్యాపారం, మానవత్వం లేని శాస్త్ర విజ్ఞానం, త్యాగం లేని ఆరాధనలను మహాత్ముడు ఏడు పాపాలుగా చెప్పేవారు. బాపూ పదవులకు దూరంగా త్యాగమయ జీవనాన్ని గడిపారు.

హద్దులు మీరిన స్వార్థం, అడుగడుగునా హింస, విచ్చలవిడి వినియోగతత్వం, మనుషుల మధ్య పోటీతత్వం, పదవులు, సంపదల వ్యామోహం, సమాజంలో బలహీనులు, ఆడపిల్లలపై అత్యాచారాలు ఇప్పుడు నిత్యకృత్యంగా కనిపిస్తున్నాయి.

ఈ ఆధునిక, స్వార్థ సమాజపు మనిషికి సాముదాయక సహజీవనాన్ని నిరాడంబరత, అహింస, దోపిడీరహిత సేవాగుణం, త్యాగనిరతి, దేశం కోసం అంకితభావం, మహోన్నత మానవతావాదాన్ని బోధించే సంస్కర్తగా.. మహాత్ముడు మన కళ్ల ముందు కదలాడుతూనే ఉంటాడు. మహాత్ముని ఆశ్రమ జీవన స్ఫూర్తి మనకు ఎప్పటికీ ఆదర్శప్రాయమే.

--- భాస్కర్​, సీనియర్​ పాత్రికేయుడు.

ఇదీ చూడండి:గాంధీ-150: గ్రామస్వరాజ్యం ఇంకెంత దూరం?

Last Updated : Sep 27, 2019, 2:51 PM IST

ABOUT THE AUTHOR

...view details