బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించే లక్ష్యంతో.. తాము అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా టీకా వేయిస్తామంటూ భాజపా హామీ ఇవ్వడంపై విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ఓటు వేస్తేనే, టీకా ఇస్తారా అంటూ విమర్శలు చేస్తున్నాయి.
ఎవరేం అన్నారంటే.?
"కేంద్రం ఇప్పుడే భారత కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ ప్రణాళికను ప్రకటించింది. తప్పుడు వాగ్దానాలతో సహా టీకా ఎప్పుడు వస్తుందో తెలియాలంటే మీరంతా దయచేసి రాష్ట్ర ఎన్నికల తేదీలను చూడండి."
- కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ
"భాజపా పాలనలోని రాష్ట్రాల పరిస్థితి ఏంటి? ఆ పార్టీకి ఓటు వేయని వారికి టీకా అందదా?"
- ఆమ్ ఆద్మీ పార్టీ
"భాజపా ఏమైనా తన పార్టీ కోశాగారం నుంచి టీకాల కోసం చెల్లిస్తుందా? ప్రభుత్వ కోశాగారం నుంచి నిధులు వస్తే.. బిహార్ ప్రజలకు ఉచితంగా ఇచ్చినప్పుడు, మిగిలిన వారు ఎందుకు చెల్లించాలి? కొవిడ్ భయాలను సొమ్ము చేసుకోవాలనే కేంద్రం తీరు చాలా తప్పుగా ఉంది."
- ఒమర్ అబ్దుల్లా, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి
"మీరు ఓట్లు వేస్తే.. మేం టీకా వేస్తాం. ఇదేం తీరు?"
- కాంగ్రెస్ నేత శశిథరూర్
సర్దిచెప్పేందుకు యత్నంచిన మంత్రి..
శశిథరూర్ ట్వీట్‌పై స్పందించారు భాజపా నేత భూపిందర్ యాదవ్. "కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటనను మీ దృష్టికి తీసుకున్న విధానం నిరాశకు గురిచేసింది. అన్ని పార్టీలు మేనిఫెస్టోను విడుదల చేశాయి. నామమాత్రపు ధరకు దేశ ప్రజలకు టీకా అందుబాటులో ఉంటుంది. రాష్ట్రాలు వాటిని ఉచితంగా అందించగలవు. మేం వాటిని చేయగలం అని హామీ ఇచ్చాం" అంటూ విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు భూపిందర్.
'వ్యాక్సిన్ ఎలక్షనిజమ్' అంటూ వైరల్..
కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విని చౌబే కూడా ఈ తరహా వివరణే ఇచ్చారు. కానీ.. ఈ వివరణ నెటిజన్లను మెప్పించలేకపోయింది. దాంతో వారు 'వ్యాక్సిన్ ఎలక్షనిజమ్' అనే హ్యాష్‌ట్యాగ్‌తో నెట్టింట్లో విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి:బిహార్ బరి: కాంగ్రెస్, ఎల్జేపీల మేనిఫెస్టోలు విడుదల