తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా యోధుల ప్రాణాలు కాపాడేలా ఐసీయూ రీడిజైనింగ్! - ఏజీ రామకృష్ణన్ పరిశోధనా పత్రం

దేశంలో కరోనాపై యుద్ధంలో ముందుండి పోరాడుతున్నారు వైద్య సిబ్బంది. ఐసీయూల్లో చికిత్స అందిస్తున్న వైద్యుల పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. 24 గంటల పాటు పీపీఈ కిట్లు ధరించి వైద్య సేవల్లో మునిగితేలుతున్నారు. బాధితులకు చికిత్స అందించడం వల్ల కొన్ని సార్లు వీరి ప్రాణాలకూ ముప్పు వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలో బెంగళూరు ఐఐఎస్​సీకి చెందిన ప్రొఫెసర్ ఐసీయూల రీడిజైనింగ్ ఆలోచనతో ముందుకొచ్చారు.

Redesign of the COVID-19 ICU
కరోనా యోధుల ప్రాణాలు కాపాడే ఐసీయూ రీడిజైనింగ్!

By

Published : Oct 20, 2020, 8:24 PM IST

కరోనా పోరులో ముందున్న వైద్యుల ప్రాణాలను రక్షించే విధంగా కొవిడ్ ఐసీయూలను రీడిజైనింగ్ చేయాలని బెంగళూరు ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ప్రొఫెసర్ ఏజీ రామకృష్ణన్ సూచించారు. కొవిడ్ బాధితులు చికిత్స పొందుతున్న ఐసీయూలు వైరస్ వ్యాప్తికి అత్యంత అనువుగా ఉంటాయని, వైద్యులు, నర్సులకు ఇది హానికరంగా మారిందని పేర్కొన్నారు.

ప్రొఫెసర్ ఏజీ రామకృష్ణన్

ఈ మేరకు రోగి నుంచి వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు రామకృష్ణన్ పలు ప్రతిపాదనలు చేశారు. దీనిపై పరిశోధనా పత్రాన్ని రూపొందించారు. ఈ సందర్భంగా ఈటీవీ భారత్​కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

"ఏసీల అవసరం లేకుండా పూర్తిగా వెంటిలేషన్ ఉన్న ఓ భవనాన్ని కొవిడ్ బాధితులకు కేటాయించాలి. భవనం ప్రవేశం వద్ద గాలిని లోపలికి పంపేందుకు, నిష్క్రమణ ద్వారం వద్ద గాలిని బయటకు పంపేందుకు శక్తిమంతమైన ఫ్యాన్​లను ఏర్పాటు చేయాలి. ఇలా.. కొవిడ్ బాధితులు వదిలిన గాలిలోని వైరస్.. ఐసీయూ గదిలోనే ఉండకుండా చేయవచ్చు. లేదంటే ఐసీయూల నుంచి వచ్చే గాలిని క్రిమిసంహారకాల ద్వారా శుద్ధి చేయాలి. ఏసీలను పూర్తిగా తొలగించే వీలు లేకుంటే, కొవిడ్ వార్డులోని ఏసీలు, ఆస్పత్రిలోని ఇతర ఏసీల మధ్య అనుసంధానం తొలగించాలి. కొవిడ్ వార్డు నుంచి ఇతర వార్డులకు వైరస్ వ్యాపించకుండా చూడాలి."

-ప్రొఫెసర్ ఏజీ రామకృష్ణన్, బెంగళూరు ఐఐఎస్​సీ

భారీ హాళ్లను కొవిడ్ బాధితుల కోసం ఐసీయూ కేంద్రాలుగా మార్చడం వల్ల ఖర్చు కూడా తగ్గుతుందని పేర్కొన్నారు రామకృష్ణన్. వైరస్​ను ఫిల్టర్ చేసి పరిశుభ్రమైన గాలిని అందించే ప్రత్యేక పరికరాలను ఐసీయూలో పనిచేసే వైద్యులు, నర్సులకు ఇవ్వాలని సూచించారు. వీటితో వైద్య సిబ్బంది సులభంగా గాలి పీల్చుకోగలుగుతారని అన్నారు. సౌథాంప్టన్ యూనివర్సిటీ తయారు చేసిన వ్యక్తిగత శ్వాసకోశ పరికరాలను అందించవచ్చని చెప్పారు.

'పీపీఈ కిట్లు అవసరం లేదు'

వైరస్ చర్మం ద్వారా శరీరంలోకి ప్రవేశించదు కాబట్టి వైద్యులు శరీరం మొత్తం కప్పుకునేలా పీపీఈ కిట్లు ధరించాల్సిన అవసరం లేదని అన్నారు. పీపీఈ కిట్లు ఎబోలా వైరస్​ను ఎదుర్కొనేందుకు రూపొందించినవని గుర్తు చేశారు.

"పీపీఈ కిట్లు అధిక ఉష్ణం, తేమతో పాటు అసౌకర్యానికి కారణమవుతాయి. ముఖం పూర్తిగా కప్పుకొనేలా ఉండి, గాలిని శుభ్రపరిచే పరికరాలు ఉంటే సరిపోతాయి. చికిత్స తర్వాత సబ్బుతో వేడి నీటితో స్నానం చేస్తే చాలు.

శారీరకంగా, మానసికంగా అలసిపోకుండా ఉండేలా వైద్య సిబ్బందికి పనివేళల మధ్య కొంత విరామం ఇవ్వాలి. సీనియర్ స్పెషలిస్ట్ వైద్యులు కొవిడ్ బాధితులను నేరుగా కలవకుండా చూడాలి. వారి సేవలు అవసరమైతే వర్చువల్​గా ఉపయోగించుకోవాలి."

-ప్రొఫెసర్ ఏజీ రామకృష్ణన్, బెంగళూరు ఐఐఎస్​సీ

ప్రస్తుతం ఐసీయూల్లో పనిచేస్తున్న వైద్యుల నుంచి అభిప్రాయాలు సేకరించిన తర్వాత ఈ రీడిజైనింగ్ ప్రతిపాదనలు తయారు చేసినట్లు తెలిపారు రామకృష్ణన్. దీంతోపాటు ఎయిర్​కండీషనింగ్ ఇంజినీర్లు, సంబంధిత జర్నల్​లు, నిపుణుల వీడియోలు, పరిశోధక పత్రాలు, నివేదికలను పరిశీలించినట్లు చెప్పారు.

సంగీతంతో సావాసం...

చికిత్స సమయంలో వైద్యులు, రోగులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని రామకృష్ణన్ అన్నారు. తోటి రోగుల మరణాన్ని చూసి కలత చెందడం వల్ల బాధితుల్లో రోగనిరోధక శక్తి తగ్గిపోతుందని తెలిపారు. సంగీతం వినడం వల్ల వైద్య సిబ్బందికి ఒత్తిడి తగ్గుతుందని అధ్యయనాల్లో తేలినట్లు గుర్తు చేశారు. మెదడుకు విశ్రాంతినిచ్చేది ఏదైనా ఉపయోగకరమేనని చెప్పారు.

స్పందన లేదు

అయితే తాను చేసిన ఈ ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి ఇంకా పంపించలేదని చెప్పారు రామకృష్ణన్. తన ఆర్టికల్ ముసాయిదాను పలు వార్తా సంస్థలు, రాష్ట్రాల వైద్య శాఖలకు పంపించినట్లు తెలిపారు. కానీ ఎవరి నుంచీ స్పందన రాలేదని వెల్లడించారు.

ఐఐఎస్​సీ అధికారిక సామాజిక మాధ్యమ ఖాతాల్లో అప్​లోడ్ చేశాక కొన్ని మీడియా సంస్థలు వీటి గురించి ఆరా తీశాయని.. అయితే ప్రభుత్వ అధికారులు ఎవరూ సంప్రదించలేదని రామకృష్ణన్ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి-'మోదీజీ.. చైనా సైన్యాన్ని ఎప్పుడు పంపుతారో చెప్పండి'

ABOUT THE AUTHOR

...view details