కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో దిల్లీ ప్రభుత్వం సఫలీకృతమైంది. రికవరీ రేటు 90.5 శాతానికి పెరిగింది. కొత్త కేసుల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది. జులై 27 తర్వాత అత్యల్పంగా ఆదివారం 652మంది వైరస్ బారినపడ్డారు. వారంలో రెండో సారి 10 కంటే తక్కువ మంది మృతి చెందారు. 24 గంటల్లోనే 1,310మంది కోలుకున్నారు. జులై 27 తర్వాత ఒక్కరోజులో అత్యధిక మంది కోలుకోవడం ఇదే తొలిసారి. దిల్లీలో మొత్తం కేసుల సంఖ్య 1,52,580కి చేరగా.. మరణాల సంఖ్య 4,196కి పెరిగింది. ప్రస్తుతం 10,823 యాక్టివ్ కేసులున్నాయి.
నిషేధం..
కరోనా పరిస్థితిని అదుపులోనే ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మతపరమైన వెేడుకలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. గణేష్ చతుర్థి, మొహర్రం ఇళ్లలోనే జరుపుకోవాలని ప్రజలకు సూచించింది. వీధుల్లో గుడారాల కింద వినాయక విగ్రహాలు, బహిరంగ ప్రదేశాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడకుండా ఆంక్షలు విధిస్తునట్లు తెలిపింది.
ఈ మేరకు అన్ని జిల్లాలలో మత పెద్దలతో చర్చలు జరిపి పరిస్థితిని వివరించాలని ప్రధాన కార్యదర్శి విజయ్ దేవ్ జిల్లా అధికారులను ఆదేశించారు. శాంతి భద్రతల దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.