దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 6,767 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 1,31,868కి పెరిగింది. గత 24 గంటల్లో మరో 147 మంది మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 3,867కు చేరిందని వెల్లడించింది.
ప్రతిరోజు 1,50,000 పరీక్షలు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు అధికారులు. ఇప్పటివరకు దేశంలో 29,44,874 మందికి పరీక్షలు జరిపినట్లు వెల్లడించారు.
మహారాష్ట్ర..
దేశంలో నమోదవుతున్న వైరస్ కేసుల్లో సుమారు సగం మహారాష్ట్రలోనే ఉన్నాయి. వరుసగా ఎనిమిదో రోజు 2వేలకు పైగా కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. గత 24 గంటల్లో అత్యధికంగా 3,041 మందికి మహమ్మారి సోకడం వల్ల.. రాష్ట్రంలో మొత్తం వైరస్ కేసుల సంఖ్య 50,231కి చేరిందని వెల్లడించారు వైద్యాధికారులు. మరో 58 మంది మరణించగా కరోనా మృతుల సంఖ్య 1,635 పెరిగిందని అధికారులు తెలిపారు.
తమిళనాడు..
తమిళనాడులో ఒక్కరోజే 765 కేసులు నమోదయ్యాయి. 8 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 16,277కు చేరింది. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 111గా నమోదైంది. తాజాగా నమోదైన కేసుల్లో ఒక్క చెన్నై నగరం నుంచే 587 కేసులు వచ్చాయి. చెన్నై నగరంలో కేసుల సంఖ్య 10,657కు చేరింది.
ఇదీ చూడండి:కరెంట్ బిల్లు దెబ్బకు వినియోగదారుడికి డబుల్ షాక్!