మెరుగైన చికిత్స, వ్యాధిపై అవగాహన పెరగడంతో కొవిడ్-19 నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల వ్యవధిలో ఏకంగా 57,381 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారని పేర్కొంది. రికవరీ రేటు 71.61శాతానికి చేరుకుందని వెల్లడించింది.
‘టెస్టు, ట్రాక్, ట్రీట్’లో భాగంగా గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 8,68,679 కొవిడ్-19 పరీక్షలు చేశామని ప్రభుత్వం తెలిపింది. ఫలితంగా ఇప్పటి వరకు చేసిన మొత్తం పరీక్షల సంఖ్య 2.85 కోట్లకు చేరుకుందని వెల్లడించింది. 12 రాష్ట్రాల్లో రికవరీ రేటు జాతీయ సగటు కన్నా మెరుగ్గా ఉందని ప్రశంసించింది. 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కోలుకుంటున్న వారు 50% కన్నా ఎక్కువగా ఉన్నారని వెల్లడించింది.