తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వినియోగదారులకు రక్షకవచం... కొత్త చట్టంలో కఠిన నిబంధనలు - ఆన్​లైన్​

ఈ రోజుల్లో వ్యాపార రంగంలో ఆన్​లైన్​ క్రయవిక్రయాలు, డిజిటల్​ లావాదేవీలు సర్వసాధారణమైపోయాయి. వీటితోపాటు వినియోగదారుల హక్కులకు, సమాచారానికి భంగం వాటిల్లుతోందనేది ప్రస్తుతం వినిపిస్తున్న మాట. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం నూతన వినియోగదారుల సంరక్షణ చట్టం(2019) ప్రవేశపెట్టింది. కొత్త చట్టానికి ఆగస్టు 9న రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. వినియోగదారుల హక్కులు కాపాడి, అనైతిక ధోరణులను అరికట్టడం మాత్రమే కాకుండా సత్వర ఫిర్యాదు పరిష్కార వ్యవస్థ రూపొందించడమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశం.

వినియోగదారులకు రక్షాకవచం...కొత్త చట్టంలో కఠిన నిబంధనలు

By

Published : Aug 19, 2019, 6:55 PM IST

Updated : Sep 27, 2019, 1:31 PM IST

‘వినియోగదారు రారాజు’ అనేది ఎప్పటి నుంచో వ్యాపారవర్గాలు పఠిస్తున్న మంత్రం. కొనేవారే లేకుంటే ఏ వ్యాపారమూ సాగదు. సమాచార, సాంకేతిక రంగాలు ఎప్పటికప్పుడు కొత్తపుంతలు తొక్కుతున్నాయి. దానివల్ల ఆధునిక సమాజంలో నిత్యం ఎన్నెన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆ మేరకు వ్యాపార ధోరణులూ కొత్తదనాన్ని సంతరించుకుంటున్నాయి. ‘ఆన్‌లైన్‌’ లావాదేవీలు సర్వసాధారణమయ్యాయి. ఇలాంటి మార్పుల గందరగోళంలో వినియోగదారుల హక్కులకు భంగం వాటిల్లకూడదు. వాటిని వాణిజ్యవర్గాలు తమ లాభాల సాధనకు అనువుగా మార్చుకోరాదు. ఈ తరహా పెడపోకడల నేపథ్యంలోనే పాలకులు కొత్త చట్టాలు తీసుకురావలసిన ఆవశ్యకత ఏర్పడింది. ఇందులో భాగంగానే కేంద్రం నూతన వినియోగదారుల సంరక్షణ చట్టం (2019) ఆవిర్భవించింది. పాత చట్టం 1986నాటిది. కొత్త చట్టానికి ఆగస్టు తొమ్మిదిన రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. వినియోగదారుల హక్కులు కాపాడటం, అనైతిక వ్యాపార ధోరణులను అరికట్టడం ఈ చట్టం ప్రధానోద్దేశాలు. సత్వర ఫిర్యాదు పరిష్కార వ్యవస్థను రూపొందించాలనీ చట్టం చెబుతోంది. ‘ఆన్‌లైన్‌’ క్రయవిక్రయాలను, విక్రయ సంస్థలనూ చేర్చి- చట్ట పరిధిని పెంచారు. విదేశాల్లో వినియోగదారులకు అత్యంత ప్రాధాన్యం ఉంది. అమెరికాలో ‘యూఎస్‌ ఫెడరేషన్‌ ట్రేడ్‌ కమిషన్‌’, ఆస్ట్రేలియాలో ‘ఆస్ట్రేలియన్‌ కన్స్యూమర్‌ అండ్‌ కమిషన్‌’ వినియోగదారుల హక్కుల పరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్నాయి.

కొత్త చట్టం మేరకు ప్రస్తుతమున్న వినియోగదారుల ఫోరాల స్థానంలో వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్‌లను జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయుల్లో ఏర్పాటు చేస్తారు. జాతీయస్థాయిలో కేంద్ర వినియోగదారు రక్షణ ప్రాధికార సంస్థ(సెంట్రల్‌ కన్స్యూమర్‌ ప్రొటెక్షన్‌ అథారిటీ- సీసీపీఏ) ఏర్పాటవుతుంది. ఇది ముఖ్య కమిషనర్‌, ఉప కమిషనర్ల ఆధ్వర్యంలో కొనసాగుతుంది. నిబంధనలను అతిక్రమించేవారికి శిక్షలు, భారీ జరిమానాలు విధిస్తుంది. ఒక దర్యాప్తు విభాగం డైరెక్టర్‌ జనరల్‌ నేతృత్వంలో పని చేస్తుంది. కేంద్ర వినియోగదారు రక్షణ సంస్థకు తనిఖీలు, జప్తులు చేసే అధికారం ఉంటుంది. అనైతిక వ్యాపారం కొనసాగిస్తున్నారని కాని, వినియోగదారుల హక్కులకు భంగం కలిగించారంటూ ఫిర్యాదు అందితే, కలెక్టరు ద్వారా నివేదిక కోరవచ్చు. వినియోగదారుల హక్కుల పరిరక్షణకోసం అవసరమైతే మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేయవచ్చు. తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇచ్చినా, వాటిలో భాగస్వాములైనా ఆయా వ్యక్తులకు రూ.10 లక్షల వరకు జరిమానా విధించే అధికారం సంస్థకు ఉంటుంది. మోసపూరిత ప్రకటనల్లో ప్రముఖులు పాల్గొంటే వారిపై ఏడాది నుంచి మూడేళ్ల వరకు నిషేధం విధిస్తారు. కల్తీలకు పాల్పడటం వల్ల హాని సంభవిస్తే, బాధ్యులకు ఆరు నెలల జైలుశిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించవచ్చు. కేంద్ర అథారిటీ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకుంటే ఆరు నెలల వరకు జైలు, రూ.20 లక్షల వరకు జరిమానా విధించవచ్చు. వినియోగదారుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించే ఉత్పత్తిదారు లేదా ‘సర్వీస్‌ ప్రొవైడర్ల’కు రెండేళ్ల జైలుశిక్ష లేదా రూ.10 లక్షల జరిమానా విధిస్తుంది. అదే తప్పు పునరావృతమైతే అయిదేళ్ల వరకు జైలు లేదా రూ.50 లక్షల వరకు జరిమానా ఉంటాయి.

కొత్త చట్టంలో కేంద్ర ప్రభుత్వం కమిషన్ల పరిధిని నిర్ణయించింది. జిల్లా కమిషన్‌ కోటి రూపాయల వరకు విలువైన లావాదేవీలపై కేసులు స్వీకరించవచ్చని తెలిపింది. రాష్ట్ర కమిషన్‌ రూ.కోటికి మించి, రూ.10 కోట్ల వరకు విలువైన వస్తు లావాదేవీలకు సంబంధించిన కేసులను విచారిస్తుంది. రూ.10 కోట్లకు మించిన విలువైన కొనుగోళ్ళపై కేసులు జాతీయ కమిషన్‌ పరిధిలోకి వస్తాయి. జిల్లా కమిషన్‌ తీర్పుపై రాష్ట్ర కమిషన్‌లో అప్పీలు చేయవచ్చు. ఇందుకోసం రావాల్సిన సొమ్ములో 50 శాతం లేదా రూ.25 వేలలో ఏది తక్కువైతే అది చెల్లించాలని షరతు విధించారు. రాష్ట్ర కమిషన్‌ తీర్పును జాతీయ కమిషన్‌లో అప్పీలు చేయాలంటే, రావాల్సిన సొమ్ములో 50 శాతం లేదా రూ.35 వేలలో ఏది తక్కువైతే అది చెల్లించాలి. తమ తీర్పులను పునస్సమీక్షించుకునే అధికారాన్ని రాష్ట్ర కమిషన్లకు కొత్త చట్టం కట్టబెట్టింది.

కొత్త చట్టంలో జిల్లా స్థాయి కమిషన్‌లో కొత్తగా వివాదాల సత్వర పరిష్కారం కోసం మధ్యవర్తిత్వ కేంద్రాలను నెలకొల్పే ఏర్పాటు చేశారు. నిర్దేశించిన గడువులోగా పరిష్కారం లభించకపోతే- జిల్లా స్థాయి కమిషన్‌ రాష్ట్ర, జాతీయ కమిషన్లకు నివేదిక పంపాల్సి ఉంటుంది. కొత్త చట్టాన్ని రాబోయే మూడు నెలల్లో పూర్తిస్థాయిలో అమలు చేస్తామని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్‌విలాస్‌ పాసవాన్‌ పేర్కొన్నారు. ప్రతి పౌరుడు ఒక వినియోగదారుడే కాబట్టి, ఉత్పత్తిదారు మొదలుకొని మధ్యవర్తులు, అంతిమ వినియోగదారు వరకు తమవంతుగా అవగాహన కల్పించేందుకు కృషి చేయాలి. వినియోగదారు నిర్వచనాన్ని మరింత విస్తరించి, ప్రభుత్వం ద్వారా కల్పించే పౌరసేవల్ని చేర్చడంవల్ల ప్రభుత్వ ప్రతిష్ఠ ఇనుమడిస్తుంది. ప్రజలకూ చట్టాలపై విశ్వాసం పాదుకొంటుంది. ప్రభుత్వ నిధులతో కొనసాగే సంస్థల ద్వారా వినియోగదారు అవగాహన సదస్సులు, విద్యాలయాల్లో కార్యశాలలు నిర్వహించడంద్వారా హక్కుల ప్రాధాన్యత, వాటికి భంగం కలిగితే ఎదురయ్యే పర్యవసానాలను తెలియజేయవచ్చు. వస్తువుల నాణ్యతను నిర్వహించడానికి ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రయోగశాలను ఏర్పాటు చేస్తే, నిర్దేశించిన ప్రమాణాలను పరిశీలించిన తరవాత వస్తువులను విపణిలోకి అనుమతించవచ్చు. దీనివల్ల నకిలీ వస్తువులను అరికట్టవచ్చు. చట్టాల అమలులో ప్రభుత్వాల నిబద్ధత, ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకం. వినియోగదారుల ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించడం, వారికి తగిన నష్టపరిహారం వెంటనే అందించడంవంటివి అత్యంత ఆవశ్యకం. వ్యాపార వర్గాలూ నిజాయతీగా వ్యవహరించినప్పుడే ‘వినియోగదారు రారాజు’ అనే మాట ఆచరణలో సార్థకమవుతుంది!

- డాక్టర్‌ ఎం.బుచ్చయ్య

(రచయిత- వాణిజ్య శాస్త్ర విభాగంలో సహాయ ఆచార్యులు)

ఇదీ చూడండి:నేరగాళ్లకు వింజామరలు

Last Updated : Sep 27, 2019, 1:31 PM IST

ABOUT THE AUTHOR

...view details