తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మహా'పోరు: భాజపా-శివసేన కూటమికి రెబల్స్​ పోటు! - భాజపా శివసేన కూటమికి రెబల్స్​ పోటు

రెబల్స్​...! ఎన్నికల వేళ బాగా వినిపించే మాట. గెలిచే సందర్భాలు తక్కువే అయినా... సొంత పార్టీ విజయావకాశాలను దెబ్బతీసే అవకాశాలు చాలా ఎక్కువ. ఇప్పుడు అలాంటి సవాలునే ఎదుర్కొంటోంది మహారాష్ట్రలోని అధికార కూటమి. 288 నియోజకవర్గాల్లో మొత్తం 75 చోట్ల రెబల్స్​ బరిలోకి దిగితే... అందులో 61 మంది భాజపా, శివసేన లక్ష్యంగా పోటీ చేస్తున్నవారే. వీరి ప్రభావం ఎంత ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరం.

'మహా'పోరు: భాజపా-శివసేన కూటమికి రెబల్స్​ పోటు!

By

Published : Oct 18, 2019, 5:58 PM IST

Updated : Oct 18, 2019, 8:28 PM IST

'మహా'పోరు: భాజపా-శివసేన కూటమికి రెబల్స్​ పోటు!

మహారాష్ట్రలో ఎన్నికల ముందే పొత్తు ప్రకటించి.. ఉమ్మడి పోరుకు సిద్ధమయ్యాయి భాజపా, శివసేన. విమర్శల జోరు... ప్రసంగాల హోరుతో ఇప్పటికే ప్రచార రథాలు శరవేగంతో కదిలిపోతున్నాయి. ప్రచార పర్వంలోనే ప్రత్యర్థులపై పైచేయి సాధించినట్లు కనిపిస్తున్న అధికార కూటమికి... సొంతవాళ్ల నుంచే సవాలు ఎదురైంది. రెబల్స్​ ప్రభావం ఎంత మేర ఉంటుందోనని నేతాగణం కలవరపడుతోంది.

భాజపాపైనే అధికం...

టికెట్లు దక్కని ఆశావహులు... రెబల్స్​గా బరిలోకి దిగడం సహజమే. మహారాష్ట్రలోనూ అదే జరిగింది. ఒకరిద్దరే కదా అనుకుంటే పెద్ద ఇబ్బంది కాదు. కానీ మొత్తం 288 నియోజకవర్గాలకుగాను దాదాపు 75 చోట్ల రెబల్స్​ తిరుగుబాటు బావుటా ఎగరేశారు. ప్రధాన పార్టీలకు ఏ మాత్రం తీసిపోకుండా వీరి ప్రచారం సాగుతోంది. ఈ 75 నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల భవితవ్యం వీరిపైనే ఆధారపడి ఉంది.

రెబల్స్​లో అత్యధికులు భాజపా-శివసేన లక్ష్యంగా బరిలోకి దిగినవారే. భాజపాకు చెందిన 38 మంది తిరుగుబాటు అభ్యర్థులుగా నిలిచారు. శివసేన అభ్యర్థులకు వ్యతిరేకంగా ఆ పార్టీకి చెందిన 23 మంది పోటీ చేస్తున్నారు.

కాంగ్రెస్​కు వ్యతిరేకంగా 9 మంది, ఎన్​సీపీపై నలుగురు రెబల్స్​గా పోటీ చేస్తున్నారు.

ఎన్నికల ముందు...

ఎన్నికల ముందు ఇతర పార్టీల నుంచి చాలా మంది నాయకులు భాజపా, శివసేనలో చేరారు. అయితే రెండు పార్టీలు ఉమ్మడిగా పోటీ చేయాలని నిర్ణయించుకోవడం వల్ల టికెట్లు దక్కని ఆశావహులు రెబల్స్​గా బరిలో నిలిచారు. కాంగ్రెస్​, ఎన్​సీపీకి రెబల్స్​ సంఖ్య ఎక్కువగా లేకపోయినా కొన్ని నియోజకవర్గాల్లో ఎదురీదక తప్పకపోవచ్చు.

ప్రాంతాల వారీగా...

ముంబయి (6)...

శివసేనకు 3, భాజపాకు ఇద్దరు రెబల్స్ ఉన్నారు.

కొంకణ్ (7)...

కాంగ్రెస్​కు 4, భాజపాకు 2, శివసేనకు వ్యతిరేకంగా ఒక రెబల్​ బరిలో ఉన్నారు.

మరాఠ్​వాడా (14)...

భాజపాకు 6, శివసేనకు 5, ఎన్​సీపీకి 2, కాంగ్రెస్​కు వ్యతిరేకంగా ఒక రెబల్​ ఉన్నారు.

పశ్చిమ మహారాష్ట్ర (13)...

భాజపా (6), శివసేన (5), ఎన్​సీపీ 1, కాంగ్రెస్​కు ఒక రెబల్​ బరిలో ఉన్నారు.

అమరావతి (5)...

భాజపా (3), శివసేన (1), కాంగ్రెస్​కు ఒక రెబల్​ ఉన్నారు.

నాగ్​పుర్​ (18)...

భాజపా (9), శివసేన (7), కాంగ్రెస్​కు ఇద్దరు తిరుగుబాటుదారులు ఉన్నారు.

ఉత్తర మహారాష్ట్ర (12)...

భాజపా (10), శివసేన (1), ఎన్​సీపీకి ఒక రెబల్​ ఉన్నారు.

మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్​ ఈనెల 21న జరగనుంది. 24న ఫలితం వెలువడనుంది.

Last Updated : Oct 18, 2019, 8:28 PM IST

ABOUT THE AUTHOR

...view details