రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభానికి తెరలేపిన సచిన్ పైలట్ బృందానికి మరో షాక్ తగిలింది. ఇప్పటికే పదవుల నుంచి తప్పించిన కాంగ్రెస్.. అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను కోరింది. కాంగ్రెస్ ఫిర్యాదు మేరకు సచిన్ పైలట్‌తో పాటు ఆయన మద్దతుదారులు అందరికీ నోటీసులు జారీ చేశారు అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషి. శుక్రవారంలోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించారు.
పైలట్‌తో పాటు 18 ఎమ్మెల్యేలు విప్‌ను ధిక్కరించి పార్టీ శాసనసభ సమావేశానికి హాజరు కాలేదని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. సోమవారం, మంగళవారం జరిగిన సమావేశాలకు హాజరుకానందున సచిన్ పైలట్‌పై వేటు వేసింది పార్టీ. ఉప ముఖ్యమంత్రి సహా పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. పైలట్‌తో వెళ్లిన విశ్వేంద్ర సింగ్, రమేశ్ మీనాను మంత్రివర్గం నుంచి తొలగించింది.
"సీఎల్పీ సమావేశానికి హాజరుకాని పార్టీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ స్పీకర్ సీపీ జోషీకి పార్టీ ఫిర్యాదు చేసింది. నోటీసులకు సమాధానాలు సంతృప్తికరంగా లేకుంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలో స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు."