దేశ రాజధాని దిల్లీ ఎన్నికల ఫలితాలు దిగ్భ్రాంతపరుస్తాయన్న కమలనాథుల మాటే ఖరారైనట్లుగా, కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ అప్రతిహతంగా పురోగమించింది. ఆమ్ ఆద్మీకి హ్యాట్రిక్ విజయం తథ్యమన్న ఎగ్జిట్ పోల్ జోస్యాలన్నీ నిజం కాగా, ప్రధాన ప్రత్యర్థిగా బరిలో గిరిగీసి నిలిచిన భాజపా ఈసారీ ఏకాంకె సీట్ల (8)తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 1998-2013 మధ్యకాలంలో షీలా దీక్షిత్ నేతృత్వంలో వరసగా ముమ్మార్లు నెగ్గిన కాంగ్రెస్ పార్టీకి మరోమారు ఓటర్లనుంచి రిక్త హస్తమే ఎదురైంది! మొత్తం 70 స్థానాల దిల్లీ అసెంబ్లీలో 2015నాటి ఎన్నికల్లో 54.5 శాతం ఓట్లతో ఎకాయెకి 67 సీట్లు సాధించి ‘ఆప్’ చరిత్ర సృష్టించడం తెలిసిందే. నాటికంటే అయిదుశాతం ఓట్లు తక్కువగా పోలైన ఈ ఎన్నికల్లో ఒక శాతం ఓట్లు తరుగుపడిన కేజ్రీవాల్ పార్టీ 62 స్థానాలు గెలుచుకోవడం విశేషమే! మరోవంక క్రితంసారితో పోలిస్తే ఏకంగా ఆరున్నర శాతం అధికంగా 38.8శాతం ఓట్లు తెచ్చుకొన్న భాజపాకు అదనంగా అయిదు స్థానాలే జమపడ్డాయి.
కాంగ్రెస్ ఘోరం...
2008లో 40.3శాతం ఓట్లు, 2013లో 24.5 శాతం, 2015లో 9.6 శాతం ఓట్లతో దిల్లీ రాజకీయాల్లో క్రమానుగతంగా ఉనికిని కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీ- ఈసారి ఏకంగా 63 చోట్ల ధరావతు కోల్పోయి మొహం వేలాడేసింది! 2015 ఎన్నికల్లో జేగీయమాన విజయం ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ గెలుచుకున్న 67 సీట్లలో 60 చోట్ల పది వేలకుపైగా, 45 చోట్ల 20 వేలకుపైగా మెజారిటీలు కళ్లు మిరుమిట్లు గొలిపాయి. నాడు భాజపా గెలుచుకొన్న మూడు సీట్లలో రెండింట ఆరువేల ఓట్లలోపే మెజారిటీ దక్కింది. అలాంటిదిప్పుడు, ఉప ముఖ్యమంత్రి సిసోడియా గెలుపు చాలాసేపు దోబూచులాడి మూడు వేలలోపు మెజారిటీతో ఒడ్డునపడ్డ వైనం- కేజ్రీవాల్ పార్టీకే అంతర్లీనంగా హెచ్చరిక కానుంది. పౌర సేవల పరంగా ఆమ్ ఆద్మీ సర్కారు కనబరచిన మేలిమి పనితీరుకు బహుమతిగా దక్కిన ఈ విజయం- రాజధాని వాసుల జీవన నాణ్యతను మెరుగుపరచే విషయంలో కేజ్రీవాల్ ప్రభుత్వంపై బాధ్యతను మరింతగా పెంచుతోంది!
‘అశ్వమేధ యాగాశ్వాన్ని వదిలాం... అది దిల్లీ దిశగా దూసుకుపోతోంది’ అని 1996 సార్వత్రిక ఎన్నికలకు ముందు ముంబయి మహాధివేశన్‌లో భాజపా మహారథిగా వాజ్‌పేయీ భవిష్యద్దర్శనం చేశారు. 1993నుంచే దిల్లీ అసెంబ్లీలో 42.8 శాతం ఓట్లు, 49 సీట్లతో పాగా వేసిన కమలనాథులు- సార్వత్రిక సమరంలోనూ సత్తాచాటి దేశాధికారం చేపట్టాలనుకొంటున్న రోజులవి. ఎన్‌డీఏ సారథిగా భాజపా తొలిసారి కేంద్రంలో అధికారానికి వచ్చినప్పుడు దిల్లీలోనూ ప్రభుత్వం కమలనాథులదే అయినా 1998నుంచి రాజధానిపై అధికారం కాంగ్రెస్ చేజిక్కింది. 2014లో, 2019లోనూ సార్వత్రిక సమరంలో ఒంటి చేత్తో ఉట్టి కొట్టి కేంద్రంలో చక్రం తిప్పుతున్న భాజపాకు రాజధాని దిల్లీ అక్షరాలా కొరకరాని కొయ్యగా మారింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో మోదీ మేనియా దిల్లీలోని మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలనూ ఊడ్చేసి 60కి పైగా అసెంబ్లీ సీట్లలో మెజారిటీ కొల్లగొట్టినా, 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ చేతిలో కంగుతినాల్సి వచ్చింది.