ఐఎన్ఎస్ విరాట్ యుద్ధనౌకను రూ.100 కోట్లకు అమ్మడానికి సిద్ధమైంది శ్రీరామ్ గ్రూప్. ముంబయికి చెందిన ఓ కంపెనీ ఈ నౌకను కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చింది. ఈ యుద్ధనౌకను విచ్ఛిన్నం కాకుండా ఆపి, మ్యూజియమ్లాగా మార్చడానికి ప్రయత్నాలు చేస్తోంది.
1987 నుంచి 2017 వరకు భారత నావికా దళంలో సేవలందించిన 'విరాట్'ను.. ఈ ఏడాది జులైలో రూ.38.54 కోట్లకు వేలంలో శ్రీరామ్ గ్రూప్ కొనుగోలు చేసింది. ఈ నౌకను విచ్ఛిన్నం చేసేందుకు గుజరాత్లోని అలంగ్ తీర ప్రాంతానికి గతవారం తరలించారు.
ఎన్ఓసీ తప్పనిసరి..
ఈ నౌకను ఎవరైనా కొనుగోలు చేయాలంటే, రక్షణ శాఖ నుంచి నిరభ్యంతర పత్రం(ఎన్ఓసీ) తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు శ్రీరామ్ గ్రూప్ ఛైర్మన్ ముఖేష్ పటేల్.
"దేశం మీద ప్రేమతో నేను ఈ యుద్ధనౌకను కొన్నాను. ప్రస్తుతం ముంబయికి చెందిన ఓ కంపెనీ.. ఈ నౌకను కొని, మ్యూజియమ్లాగా మార్చాలని భావిస్తోంది. వాళ్లు దేశ భక్తితోనే ఈ పని చేస్తున్నందున.. నేను వారికి అమ్మేందుకు అంగీకరించాను. అయితే.. వారు రక్షణ శాఖ నుంచి నిరభ్యంతర పత్రం తీసుకోవాల్సి ఉంటుంది. అది లేకుండా నేను వారికి అమ్మలేను. ఎన్ఓసీ కోసం ఆ కంపెనీ అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. అయినప్పటికీ.. నేను ఎక్కువకాలం వేచిచూడను. వారం వరకే గడువు ఇస్తాను. ఆ తర్వాత ఈ నౌకను విచ్ఛిన్నం చేస్తాను."
- ముఖేష్ పటేల్, శ్రీరామ్ గ్రూప్ ఛైర్మన్