భాజపాపై పోరాటానికి మళ్లీ కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు గుజరాత్ మాజీ సీఎం, ప్రజాశక్తి డెమోక్రటిక్ పార్టీ (పీఎస్‌డీపీ) వ్యవస్థాపకుడు శంకర్ సిన్హ్ వాఘేలా అన్నారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు కాంగ్రెస్‌లో పనిచేసిన 80 ఏళ్ల వాఘేలా.. తనను మళ్లీ పార్టీలోకి రావాలంటూ అనేకమంది కార్యకర్తలు, నేతలు కోరుతున్నారంటూ బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
గతేడాది భరూచ్ జిల్లాలోని పిరమాన్ గ్రామంలో కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్‌పటేల్ అంత్యక్రియలకు హాజరైనప్పుడు చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలు తనను పార్టీలో చేరాలంటూ కన్నీళ్లు పెట్టుకొని అడిగారని తెలిపారు. అంతేకాకుండా కొందరు నేతలు కూడా పట్టుబడుతున్నారన్నారు.
భాజపాతో పోరాడేందుకు ఎలాంటి షరతులు లేకుండా కాంగ్రెస్‌లో చేరేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. కాంగ్రెస్‌లో మళ్లీ చేరేందుకు తనకెలాంటి సమస్య లేదని చెప్పారు. సోనియా, రాహుల్ గాంధీతో సమావేశమైన తర్వాత తగిన నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.