తెలంగాణ

telangana

దేశ​ ప్రయోజనాలకే పెద్దపీట.. ఆర్​సెప్​కు భారత్​ నో

By

Published : Nov 4, 2019, 4:12 PM IST

Updated : Nov 4, 2019, 7:42 PM IST

మరికాసేపట్లో ఆర్​సెప్​ ఒప్పందం

19:18 November 04

దేశ​ ప్రయోజనాలకే పెద్దపీట.. ఆర్​సెప్​కు భారత్​ నో

దేశ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తూ... ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం- ఆర్​సెప్​లో భారత చేరదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ​ ప్రకటించారు. దేశంలోని పేద, ఆర్థిక రంగాలను దృష్టిలో పెట్టుకునే మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారు. వాణిజ్య రంగంలో అంతర్జాతీయ పోటీకి భారత్​ సిద్ధంగా ఉన్నప్పటికీ.. స్వేచ్ఛావాణిజ్య ఒప్పందంలోని ప్రధాన ప్రయోజనాలపై స్పష్టత లేదని మోదీ అభిప్రాయపడ్డారు. 

బ్యాంకాక్​ వేదికగా జరిగిన ఆర్​సెప్​ సమావేశంలో భారత్​ వైఖరిని కరాఖండిగా ప్రకటించారు మోదీ. ప్రపంచ వ్యాపార శక్తుల ఒత్తిళ్లకు​ తలొగ్గే రోజులు పోయాయని.. ఈ ఒప్పందం వల్ల తమ దేశం ఎదుర్కొనే సమస్యలపై మోదీ తన వైఖరిని స్పష్టంగా చెప్పారు. ఆర్​సెప్​ తరహాలో ఉండే ఎమ్​ఎఫ్​ఎన్​(మోస్ట్​ ఫేవర్డ్​ నేషన్​)లోనూ భారత్​ చేరబోదని తేల్చిచెప్పారు ప్రధాని.

ప్రస్తుత ఒప్పందంలోని లోపాల్ని ఎత్తిచూపించారు భారత ప్రధాని. ప్రాంతీయ అంతర్గతకు భారత్​ కట్టుబడి ఉంటుందని.. కానీ గత ఏడేళ్లుగా ఆర్​సెప్​లో జరిగిన మార్పుల వల్ల తమ దేశానికి విరుద్ధ ప్రయోజనాలు చేకూరే అవకాశముందని తన ప్రసంగంలో వెల్లడించారు మోదీ.

"అంతర్జాతీయ నిబంధానల ప్రకారం  ప్రాంతీయ సమగ్రతతో పాటు స్వేచ్ఛా వాణిజ్యానికి భారత్​ కట్టుబడి ఉంటుంది. ఆర్​సెప్​ చర్చల్లో భారత్​ ఎంతో నిర్ణయాత్మకంగా, అర్థవంతమైన విధంగా పాల్గొంది. కానీ గత ఏడేళ్లలో ఆర్​సెప్​ సంప్రదింపుల్లో అనేక మార్పులు జరిగాయి. వీటిని మనం విస్మరించలేం. ప్రస్తుత ఆర్​సెప్​ ఒప్పందం.. ప్రధాన ఆర్​సెప్​ స్ఫూర్థిని ప్రతిబింబించదు."
        --- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

ఆర్​సెప్​ ఒప్పందంపై భారత్​ సంతకం చేస్తే... దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే అవకాశముందని విపక్షాలు ఆరోపించాయి. ఒప్పందం వల్ల దేశంలోకి చైనా చౌక ధర సరుకులు వెల్లువెత్తుతాయని... దీని వల్ల దేశంలోని చిరు వ్యాపారులు, రైతులు భారీగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశాయి. 

అయితే.. భారత్​ ఆర్​సెప్​లో చేరాలనుకుంటే తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని తెలిపింది ఆస్ట్రేలియా. మిగతా దేశాలు కూడా.. భారత్​ లేవనెత్తిన అంశాలపై స్పందించాయి. అన్ని దేశాలు కలిసి ఈ అంశాలపై చర్చిస్తామని పలు దేశాల ప్రతినిధులు పేర్కొన్నారు. 

18:05 November 04

ఆర్​సెప్​ ఒప్పందాన్ని వ్యతిరేకించన భారత్​

ఆర్​సెప్​లో చేరకూడని భారత్​ నిర్ణయించినట్టు సమాచారం. ఒప్పందంలోని కీలక అంశాలపై భారత్​ అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఒప్పందంపై సంతకం చేయడానికి మోదీ విముఖత వ్యక్తం చేసినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.

17:28 November 04

చైనా వ్యాఖ్యలు

ఆర్​సెప్​పై స్ఫూర్తిమంతమైన పురోగతి సాధించినప్పటికీ... ఒప్పందం కుదుర్చుకోవడానికి అది సరిపోదని అభిప్రాయపడింది చైనా. త్వరలోనే ఒప్పందంపై సంతకాలు చేయడానికి సభ్య దేశాలు కృషి చేయనున్నట్టు తెలిపింది.
 

17:24 November 04

'భారత్​కు తలుపు తెరిచే ఉంటుంది...'

ఆర్​సెప్​లో భారత్​ చేరాలనుకుంటే... తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని తెలిపింది ఆస్ట్రేలియా. అయితే భారత్​ లేకుండా ఒప్పందం కుదిరే అవకాశముందని అభిప్రాయపడింది. 

16:56 November 04

రాహుల్​ 'ఆర్​సెప్​' విమర్శలు

ఆర్​సెప్​ ఒప్పందంపై భారత్​ సంతకం చేస్తే.. దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుందని రాహుల్​ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్​సెప్​ వల్ల భారత్​లో తయారీ(మేకిన్​ ఇండియా) కాస్త చైనా నుంచి కొనుగోలు(బై ఫ్రమ్​ చైనా)గా మారిపోయిందని ఎద్దేవా చేశారు.
 

16:49 November 04

చైనాపై అభ్యంతరం

భారత ప్రధాని నరేంద్రమోదీ బ్యాంకాక్‌లో ఆసియాన్‌ దేశాధినేతలతో ఆదివారం సమావేశమయ్యారు. చైనా చౌక వస్తువులు వెల్లువలా వచ్చి పడటం వల్ల తమ దేశంలో చిరు వ్యాపారుల పరిస్థితి దెబ్బతింటుందంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మార్కెట్‌ అందుబాటు అనేది అన్ని పక్షాలకూ అర్థవంతమైన రీతిలో ఉండాలని మోదీ పునరుద్ఘాటించారు.

ఆర్​సీఈపీ ఒప్పందం గురించి ఈ భేటీల్లో మాటమాత్రంగానైనా ఆయన ప్రస్తావించలేదు. ఆసియాన్‌తో భారత్‌ ఒప్పందం పునఃసమీక్ష కోసమే మాట్లాడారు.

16:20 November 04

భారత్​ ఒక్కటే!

భారత్‌ నుంచి న్యూజిలాండ్‌ వరకు 16 దేశాల మధ్య ఆర్​సీఈపీ ఒప్పందం కుదరాల్సి ఉంది. ప్రపంచంలో సగం జనాభా ఈ దేశాల్లోనే ఉంది. మార్కెట్‌ అందుబాటు సంబంధిత చర్చలు చాలావరకు పూర్తయ్యాయని, కొద్దిపాటి ద్వైపాక్షిక అంశాలు 2020 ఫిబ్రవరి నాటికి కొలిక్కి వస్తాయని ముసాయిదా ఒప్పందంలో పేర్కొన్నారు.

సభ్యదేశాల్లో ఒక్కటి మినహా మిగిలిన అన్నింటి తీర్మానాలు పూర్తయ్యాయని చెప్పడం భారత్‌ను ఉద్దేశించేనని భావిస్తున్నారు. ఆర్​సీఈపీపై సంతకం చేయడానికి దేశాలన్నీ కట్టుబడి ఉన్నాయని ప్రకటన పేర్కొంది.

15:47 November 04

ఆర్​సెప్​ ఒప్పందంపై భారత్​ ఏమంటోంది..?

బ్యాంకాక్​లో ఆర్​సెప్​ దేశాధినేతల సమావేశం ప్రారంభమైంది. ఏడేళ్లుగా సాగుతున్న ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై అధినేతలు ఓ ప్రకటన చేసే అవకాశముంది. ప్రపంచ అతిపెద్ద వాణిజ్య ప్రాంతాన్ని తీర్చిదిద్దడమే ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం. 

ఆర్​సెప్​ ఒప్పందంలో భారత్​ చేరితో సభ్యదేశాల సంఖ్య 16కు చేరుతుంది.  అయితే.. వెల్లువెత్తుతున్న చైనా దిగుమతులపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన భారత్‌... కొన్ని కొత్త డిమాండ్లను తెరపైకి తీసుకువచ్చింది.

Last Updated : Nov 4, 2019, 7:42 PM IST

ABOUT THE AUTHOR

...view details