నవ శకం: 'చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్'గా రావత్ దేశ రక్షణ రంగంలో సరికొత్త శకం ఆరంభమైంది. మొట్టమొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్)గా జనరల్ బిపిన్ రావత్ బాధ్యతలు స్వీకరించారు. త్రివిధ దళాల తరఫున రక్షణశాఖకు ఏకైక సలహాదారుగా నేటి నుంచి మూడేళ్లపాటు విధులు నిర్వర్తించనున్నారు. మంగళవారమే సైన్యాధిపతిగా పదవీ విరమణ చేశారు రావత్.
ప్రభుత్వ ఆదేశానుసారం పనిచేస్తాం
సీడీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం మీడియాతో మాట్లాడారు రావత్. సైనిక దళాల్లో రాజకీయ జోక్యం పెరిగిపోతోందన్న ఆరోపణలపై ఈ సందర్భంగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. త్రివిధ దళాలు రాజకీయాలకు దూరంగా ఉంటాయని, ప్రభుత్వ ఆదేశానుసారం పనిచేస్తాయని వివరించారు.
మూడు కలిస్తే ఎక్కువ ఫలితాలు
సీడీఎస్‌కు స్పష్టమైన లక్ష్యాలు ఉన్నాయని తెలిపారు బిపిన్ రావత్. మూడు దళాలు సమన్వయంతో పనిచేసేలా చూడాల్సిన బాధ్యత సీడీఎస్దేనని వివరించారు. సైన్యం, నావికాదళం, వాయుసేన బృందంగా ఏర్పడి పనిచేస్తే.. మూడు దళాలు విడివిడిగా సాధించే వాటికంటే ఎక్కువ ఫలితాలను సాధించొచ్చని అభిప్రాయపడ్డారు.
" సైన్యం, నావికాదళం, వాయుసేన ఒక జట్టుగా కలిసి పనిచేస్తాయి. త్రివిధ దళాల ఆర్థిక వనరులపై దృష్టి కేంద్రీకరిస్తాం. ఏకీకరణపై దృష్టి పెడతాం. శిక్షణను ఎలా ఏకీకరణ చేయాలన్న అంశంపైనా దృష్టి సారిస్తాం. ఈ మేరకు సీడీఎస్‌కు పని అప్పగించారు. ఇంకా ఏమైనా అదనపు బాధ్యతలు అప్పగిస్తే సమర్థంగా నిర్వహిస్తాం. "
- బిపిన్ రావత్, సీడీఎస్
యుద్ధ స్మారకం వద్ద నివాళులు
అంతకుముందు దిల్లీలోని జాతీయ యుద్ధస్మారకం వద్ద నివాళులు అర్పించారు రావత్. సైనిక వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సైనిక దళాధిపతి మనోజ్ ముకుంద్ నవరణె, ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేష్ కుమార్ సింగ్ బదౌరియా, నావికాదళాధిపతి కరంబీర్ సింగ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ప్రధాని శుభాకాంక్షలు
ప్రథమ సీడీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన బిపిన్ రావత్‌కు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. సీడీఎస్ బాధ్యతల్ని రావత్ సమర్థంగా నిర్వర్తించాలని ఆకాంక్షించారు. సైనిక వ్యవహారాల విభాగం ఏర్పాటు చేసి సీడీఎస్‌తో సంస్థాగతీకరించడాన్ని చారిత్రక సంస్కరణగా అభివర్ణించారు మోదీ.