సినిమా కలెక్షన్లను ఆర్థిక వ్యవస్థకు ముడిపెడుతూ కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో దుమారం రేగింది. తాజాగా ఈ తన ప్రసంగాన్ని వక్రీకరించారని ఆయన వివరణ ఇచ్చారు. అందుకు చింతిస్తున్నానన్న ఆయన.. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు స్పష్టం చేశారు.
"ఒక్కరోజులోనే మూడు సినిమాలు 120 కోట్లు వసూలు చేశాయన్న వ్యాఖ్యలు నిజానికి సరైనవే. సినిమాలకు రాజధాని అయిన ముంబయిలో ఉన్నాను కాబట్టి నేను ఈ వ్యాఖ్యలు చేశాను. లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి, పెద్ద ఎత్తున పన్ను ఆదాయాన్ని ప్రభుత్వానికి అందిస్తున్న మన సినిమా పరిశ్రమ పట్ల ఎంతో గర్వపడుతున్నాను. ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయడానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలను కూడా వివరించాను. విలేకరుల సమావేశంలో నేను మాట్లాడిన పూర్తి వీడియో సామాజిక మాధ్యమాల్లో అందుబాటులో ఉంది. నా ప్రసంగంలోని కొద్ది భాగాన్ని తీసుకొని దాన్ని వక్రీకరించారు. దీనికి చింతిస్తున్నాను. సున్నితమైన మనస్సు కలిగిన వ్యక్తిని కనుక నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను."
-రవిశంకర్ ప్రసాద్, కేంద్ర న్యాయ శాఖ మంత్రి.