ఏన్నో ప్రకృతి అందాలతో అలరారే కర్ణాటకలో మరో ప్రత్యేక ఆకర్షణ అబ్బురపరుస్తోంది. ఉల్లాసం కోసం బీచ్‌లవైపు వెళ్లేవారిలో మరింత ఉత్సాహం నింపుతోంది. అదే.. బ్లాక్‌శాండ్ బీచ్. నల్లని సాగర తీరంతో చూపుతిప్పుకోనివ్వట్లేదు. ఉత్తర కన్నడ జిల్లాలోని కార్వార్ ప్రాంతంలో ఉంది 'తిల్మటి' సాగరతీరం. ఈ మనోహరమైన బీచ్ అందాలు పర్యటకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి.
"తిల్మటి బీచ్‌లో నల్లటి ఇసుక ఉంటుంది. దేశంలో నల్లటి ఇసుకతో కనువిందుచేసే సాగరతీరం ఇదొక్కటే."-నితీశ్ నాయక్, పర్యటకుడు
తిల్మటి బీచ్‌కు మరో ప్రత్యేక ఆకర్షణ కూడా ఉంది. ఈ సాగరతీరానికి ఎడమవైపు మజాలి తీరప్రాంతం ఉంటుంది. కుడివైపు గోవా సరిహద్దులోని పోలెం బీచ్ ఉంటుంది. ఇవి రెండూ సాధారణ ఇసుకతోనే ఉంటాయి. వాటి మధ్యలో నల్లటి ఇసుక తీరంతో అచ్చెరువొందిస్తుంది తిల్మటి. ఈ నల్లరంగుకు కారణాలు ఇప్పటికే మిస్టరీనే..