హైదరాబాద్ పశువైద్యురాలి హత్యాచారంపై పార్లమెంట్ సభ్యులు తమ గళం వినిపిస్తున్నారు. నిన్న సమాజ్వాది పార్టీ ఎంపీ జయా బచ్చన్ రాజ్యసభలో ప్రసంగిస్తూ.. 'నిందితులను నడిరోడ్డుపైకి ఈడ్చుకొచ్చి ఉరి తీయాలి' అని అన్నారు. తాజాగా భాజపా ఎంపీ హేమా మాలిని ఈ కేసులోని నిందితులను 'శాశ్వతంగా జైల్లో బంధించడమే సబబు' అని అభిప్రాయపడ్డారు. పార్లమెంటు ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు హేమ.
"ఈ సమస్యకు వీలైనంత త్వరగా పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రోజూ మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు చూస్తూనే ఉన్నాం. మహిళలను లైంగికంగా వేధిస్తున్నారు. జైలు నుంచి ఆ నిందితులు ఎన్నటికీ బయటకు రాకుండా నిర్ణయం తీసుకోవాలి. అలాంటి వాళ్లు సమాజంలో తిరగకూడదు. ఎందుకంటే.. వారిది అసుర బుద్ధి. బయటకు వస్తే మళ్లీ మళ్లీ అలాంటి పనే చేస్తారు. పక్కవారిని కూడా ప్రోత్సహిస్తారు. వాళ్లను చూసి ఇంకొకరు నేర్చుకుంటారు."