తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఒక తరగతి-ఒక ఛానల్​ దిశగా కేంద్రం సన్నాహాలు'

దేశవ్యాప్తంగా 'ఒక తరగతి - ఒక ఛానల్​' విధానాన్ని అమలు చేసే దిశగా సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు కేంద్ర మానవ వనరులు శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్​ నిశాంక్​. ఇందుకోసం డిజిటల్​ బోధనను మరింత సరళతరం చేస్తున్నట్లు చెప్పారు. అందరికీ ఆన్​లైన్​ పాఠాలు అందేలా కృషిచేస్తున్నట్లు చెప్పిన నిశాంక్​.. స్మార్ట్​ఫోన్​, అంతర్జాల సేవలు లేని వారికి ప్రత్యామ్నయాలు ఏర్పాటుచేస్తున్నట్లు వివరించారు. దేశంలో విద్యావ్యవస్థ అభివృద్ధిపై ఆయన ఇంకా ఏమన్నారంటే...

RAMESH POKHRIAL NISHANK RAMESH POKHRIAL NISHANK
ఒక తరగతి-ఒక ఛానల్​ దిశగా కేంద్రం సన్నాహాలు

By

Published : Jul 19, 2020, 2:44 PM IST

ఒక తరగతి - ఒక ఛానెల్ అన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనకు కార్యరూపం కల్పించే దిశగా పనిచేస్తున్నట్లు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్‌ తెలిపారు. డిజిటల్ సాధనాలు లేని విద్యార్థులకు, అంతర్జాలం అందుబాటులో లేనివారికి విద్యా బోధనను దగ్గర చేసేందుకు సృజనాత్మకతతో కూడిన ఆలోచనలు చేస్తున్నట్లు 'ఈటీవీ భారత్‌' ముఖాముఖిలో వెల్లడించారు​. అనతి కాలంలోనే ఆన్‌లైన్ విద్యాబోధనలో భారత్ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. ఉన్నత విద్యకోసం.. విదేశాలవైపు చూసే మానసిక రుగ్మత నుంచి యువభారతం బయటపడాలని ఆకాంక్షించారు నిశాంక్​.

రమేశ్​ పోఖ్రియాల్​ నిశాంక్​తో ఈటీవీ భారత్​​ ప్రత్యేక​ ముఖాముఖి

కొవిడ్​-19తో ఆన్​లైన్​ బోధన..

కొవిడ్​-19తో 2020లో విద్యా వ్యవస్థపై తీవ్రప్రభావం పడిందన్నారు నిశాంక్​. అయితే పరిస్థితులు మారిపోయి ఆన్‌లైన్ విద్యాబోధన తెరపైకి వచ్చిందన్న ఆయన.. దీనిపై సమర్థంగా పనిచేస్తున్నట్లు వివరించారు. అందులో భాగంగా అనేక కమిటీల చర్చల అనంతరం.. సీబీఎస్​ఈ, ఎన్​సీఈఆర్​టీలు విద్యా క్యాలెండర్​ను రూపొందించాయన్నారు. ఇవి విద్యార్థులకు తప్పక లబ్ధి చేకూరుస్తాయని విశ్వాసం వ్యక్తంచేశారు నిశాంక్​.

నేటితరంలో విద్యార్థినీ విద్యార్థులు తమ కుటుంబానికి మాత్రమే పరిమితం కాదని.. వారు దేశానికి భవిష్యత్తు అని కొనియాడారు పోఖ్రియాల్​. కాబట్టి వారి రక్షణకే ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ముఖ్యంగా పేద విద్యార్థులకు చేరువ కావడమే తమ లక్షమన్న ఆయన​.. అందుకు తగ్గట్లుగా సన్నద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. ఇందులో రాష్ట్ర విద్యాశాఖలు, విద్యామంత్రుల కృషిని ప్రశంసించారు.

ఆ దిశగా ప్రయత్నాలు..

ప్రస్తుత సమాజంలో డిజిటల్​ అంతరం నెలకొన్న తరుణంలో.. ఇందుకోసం ఈ-పాఠశాల, దీక్షా పోర్టల్​లో సుమారు 80 వేల పాఠ్యాంశాలను పొందిపరచినట్లు స్పష్టం చేశారు నిశాంక్​. ఫలితంగా విద్యార్థులకు మరింత చేరువ అవుతామన్న ఆయన.. ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యాంశాలను వారికి అందజేస్తామని చెప్పారు. అయితే స్మార్ట్​ఫోన్​, ఇంటర్నెట్​ అందుబాటులో లేని విద్యార్థులకు కూడా వీటిని చేరువ చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం ప్రధాని చెప్పిన 'ఒక తరగతి- ఒక ఛానెల్‌', 'ఒక దేశం- ఒక డిజిటల్ వేదిక' అనే దృక్పథాన్ని సాకారం చేసే దిశగా ముందడుగు వేస్తున్నట్లు వివరించారు.

అందులో భాగంగానే సైన్స్​ పాఠ్శాంశాలకు సంబంధించిన ప్రయోగ అంశాలనూ ప్రస్తావించారు. దీనిపై సంప్రదింపులు జరుగుతున్నాయన్న నిశాంక్​.. విద్యార్థుల సమయాన్ని ఏమాత్రం వృథా కానివ్వమని హామీ ఇచ్చారు. భారత సంప్రదాయ విధానం నుంచి వేగంగా ఆన్​లైన్​ బోధనకు మళ్లినట్లు చెప్పారు. ఈ విషయంలో భారత్​ విశ్వగురువుగా మారుతోందని కొనియాడారు నిశాంక్​.

ఇక్కడే ఉత్తమ విద్యావ్యవస్థలు..

భారతీయ విద్యా వ్యవస్థపై ప్రశంసలు కురిపించారు పోఖ్రియాల్​. దేశంలో గుణాత్మక విద్యాబోధన లేదనే అపోహతోనే కొందరు విదేశాలకు తరళివెళ్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇందుకోసం విద్యాబోధనను మరింత మెరుగు పరుస్తున్నట్లు చెప్పిన నిశాంక్​.. ప్రపంచ అత్యుత్తమ విద్యాసంస్థలతో దేశీయ విద్యావ్యవస్థను అనుసంధానం చేస్తున్నామన్నారు. ఉన్నత విద్యకోసం బయటకు వెళ్లాల్సిన పనిలేకుండా.. మన దేశంలోనే ఉత్తమ విద్యనందిస్తున్నామని పేర్కొన్నారు. ఐఐటీ, ఐఐఎమ్​ లాంటి విశ్వవిద్యాలయాల్లో సుమారు 50 వేల మంది విదేశీ విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా భారతీయ విశ్వవిద్యాలయాల్లో చదువుకునేందుకు దేశ విదేశాల నుంచి భారీగా విద్యార్థులు తరలివస్తుంటారని చెప్పారు నిశాంక్.

ఇదీ చదవండి:భారీ వర్షాలకు దిల్లీ గజగజ.. స్తంభించిన జనజీవనం

ABOUT THE AUTHOR

...view details