అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వారంలోగా ఓ ట్రస్టును ఏర్పాటు చేయనుంది. దీంతో సహా మసీదు నిర్మాణం కోసం సున్నీ వక్ఫ్ బోర్డుకు 5 ఎకరాల భూమి కేటాయింపుపైనా నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారులు వెల్లడించారు.
అయోధ్య రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ప్రణాళిక సిద్ధం చేసి కేంద్ర మంత్రివర్గం ఆమోదం కోసం పంపనున్నారు. ఆమోదం పొందిన అనంతరం ట్రస్టు నియామకంతో పాటు, మసీదుకు భూకేటాయింపు ప్రక్రియలు పూర్తి చేయనున్నట్లు ఓ అధికారి తెలిపారు.
సున్నీ వక్ఫ్ బోర్డుకు మూడు ప్లాట్లను కేటాయించి ఒకదాన్ని ఎంచుకునే అవకాశం కల్పించనుంది హోంమంత్రిత్వ శాఖ.
శ్రీరాముడి జన్మస్థలంగా హిందువులు భావించే అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి 3 నెలల్లోగా ట్రస్టును నియమించాలని సుప్రీంకోర్టు నవంబర్ 9న చారిత్రక తీర్పునిచ్చింది. అలాగే మసీదు నిర్మించుకునేందుకు సున్నీ వక్ఫ్‌బోర్డుకు ప్రత్యామ్నాయంగా ఐదు ఎకరాల భూమి కేటాయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో తీర్పులోని అంశాలన్నింటినీ పరిశీలించేందుకు ప్రత్యేక డెస్క్‌ను ఏర్పాటు చేసింది కేంద్రం.
ఇదీ చూడండి:- బావిలో పడిన ఏనుగును రక్షించేందుకు అదిరే ఐడియా