రామ జన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదం భారత న్యాయ చరిత్రలో అత్యంత తీవ్రంగా పోటీపడిన కేసుల్లో ఒకటని భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి పేర్కొన్నారు. ప్రతీఒక్క అంశంలో న్యాయవాదుల మధ్య వాడీవేడీ చర్చలు జరిగాయని తెలిపారు. అత్యంత ఉద్రేకంతో న్యాయవాదులు వాదనల్లో పాల్గొన్నారని చెప్పారు.
'అయోధ్య వాదనలు, తీర్పు' అంశాలపై పుస్తకం రాసిన జర్నలిస్ట్ మాలా దీక్షిత్‌కు ఈ మేరకు జస్టిస్ గొగొయి సందేశం ఇచ్చారు. భారీ రికార్డుల ఆధారంగా.. బహుముఖ సమస్యలు ఉన్న కేసులకు పరిష్కారం నిర్ణయిస్తారని పేర్కొన్నారు.
"అయోధ్య కేసుకు ప్రత్యేక స్థానం ఉంటుంది. భారత న్యాయ చరిత్రలో అత్యంత తీవ్రంగా పోటీ పడిన కేసుల్లో ఇదొకటి. బహుముఖ సమస్యలకు రికార్డులు, లిఖిత, డాక్యుమెంటరీ సాక్ష్యాల ఆధారంగా తుది తీర్మానాన్ని రూపొందించడం జరుగుతుంది. ఇరుపక్షాలకు ప్రాతినిథ్యం వహించిన న్యాయవాదులు ప్రతీ పాయింట్‌ను అత్యంత ఉద్రేకంతో వాదించారు."
-జస్టిస్ రంజన్ గొగొయి, భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి
అయోధ్య కేసులో తుది తీర్పు ఇవ్వడం సవాల్‌తో కూడుకున్న విషయమని జస్టిస్ గొగొయి పేర్కొన్నారు. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయని వివరించారు. 40 రోజుల నిరంతర వాదనల్లో న్యాయవాదుల సహకారం ఎనలేనిదని కొనియాడారు.