అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి.. ఆగస్టు 3,5 తేదీలను ప్రతిపాదించారు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులు. శనివారం జరిగిన ట్రస్ట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. ఈ రెండు తేదీలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పంపినట్టు తెలిపారు. ప్రధాని నిర్ణయించిన తేదీన ఆలయ నిర్మాణం ప్రారంభించనున్నట్లు ట్రస్ట్ సభ్యుడు కామేశ్వర్ చౌపాల్ వెల్లడించారు.
ఆలయ నిర్మాణ ప్రారంభ కార్యక్రమం కోసం ఇప్పటికే ఏర్పాట్లు మొదలయ్యాయి. ఎల్ అండ్ టీ సంస్థ.. నేలలోని మట్టిని పరీక్షిస్తోంది. దీనిని బట్టి ప్రణాళికలు రచిస్తారు. వీటి ఆధారంగానే ఆలయ నిర్మాణం ఉంటుందని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. మూడు, మూడున్నర సంవత్సరాల్లో నిర్మాణం పూర్తిచేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.