తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గందరగోళం మధ్య వ్యవసాయ బిల్లులకు ఆమోదం - Death Warrants for Farmers

కేంద్రం ప్రతిపాదించిన రెండు వ్యవసాయ బిల్లులకు రాజ్యసభలో ఆమోదం లభించింది. విపక్షాల ఆందోళనల నేపథ్యంలో మూజువాణి ఓటుతో బిల్లులు గట్టెక్కాయి.

rajyasabha passes agriculture bills
వ్యవసాయ బిల్లులకు రాజ్యసభ ఆమోదం

By

Published : Sep 20, 2020, 2:00 PM IST

Updated : Sep 20, 2020, 2:32 PM IST

వ్యవసాయం రంగంలో సంస్కరణల కోసం కేంద్రం ప్రతిపాదించిన బిల్లులకు పార్లమెంటు ఆమోదం లభించింది. ఇప్పటికే లోక్​సభ గడప దాటిన ఫార్మర్స్‌ ప్రొడ్యూస్‌ ట్రేడ్‌ అండ్‌ కామర్స్‌ (ప్రమోషన్‌ అండ్‌ ఫెసిలిటేషన్‌), ఫార్మర్స్‌ (ఎంపవర్‌మెంట్‌ అండ్‌ ప్రొటెక్షన్‌) అగ్రిమెంట్‌ ఆన్‌ ప్రైస్‌ అష్యూరెన్స్‌ అండ్‌ ఫామ్‌ సర్వీసెస్‌ బిల్లులను గందరగోళం మధ్య రాజ్యసభ ఆమోదించింది. బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్, టీఎంసీ, ఎస్పీ సభ్యులు కేంద్రంపై విమర్శలతో విరుచుకుపడ్డారు. కార్పొరేట్ శక్తులకు మేలు చేకుర్చేందుకు వీటిని తీసుకొచ్చారని ధ్వజమెత్తారు.

ఆమోదం పొందిన రెండు బిల్లులు..

1. రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) బిల్లు-2020

రైతులకు తమ ఉత్పత్తులను ప్రభుత్వామోదిత ఏపీఎంసీ మార్కెట్​ వెలుపల విక్రయించుకోవడానికి ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది. రైతులకు సులభమైన ప్రత్యామ్నాయ మార్కెటింగ్​ మార్గాలను కల్పించడం దీని ఉద్దేశం. ఈ చట్టం ప్రకారం రైతులు తమ ఉత్పత్తులను విక్రయించడం వల్ల వారి నుంచి ఎలాంటి సెస్​ను గానీ పన్నులనూ వసూలు చేయరు.

2. రైతుల సాధికారత, రక్షణ, వ్యవసాయ సేవల బిల్లు- 2020

రైతులు నేరుగా అగ్రికల్చర్​ బిజినెస్​ సంస్థలు, టోకు వ్యాపారులు, ఎగుమతిదారులు, పెద్ద రిటైలర్లతో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది.

ఇదీ చూడండి: కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ బిల్లుల్లో ఏముందంటే?

'బిల్లులు కాదు డెత్​ వారెంట్లు'

వ్యవసాయ సంస్కరణల పేరుతో కేంద్రం తీసుకొచ్చిన బిల్లులు రైతుల పాలిట డెత్​ వారెంట్లు అని ధ్వజమెత్తారు కాంగ్రెస్ ఎంపీ ప్రతాప్​ సింగ్ బజ్వా. భూ యజమానులకు వ్యతిరేకమైన ఈ బిల్లులను కాంగ్రెస్ అంగీకరించే ప్రసక్తే లేదని తెలిపారు. కనీస మద్దుతు ధరను నీరు గార్చే విధంగా బిల్లులు ఉన్నాయని ఆరోపించారు. కరోనా కష్ట సమయంలో ఇలాంటి బిల్లులు తీసుకురావాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు.

'మోదీ వాగ్దానాలకు విశ్వసనీయత లేదు'

వ్యవసాయ బిల్లులపై ప్రజలను విపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు టీఎంసీ సభ్యుడు డెరెక్​ ఓబ్రయన్​. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానన్న మోదీ వాగ్దానాన్ని గుర్తు చేశారు. ప్రస్తుత ధరలతో రైతుల ఆదాయం 2028 వరకు కూడా పెరగదన్నారు. మోదీ హామీలకు విశ్వసనీయత లేదని విమర్శించారు. ఈ బిల్లులను పార్లమెంటు ఎంపిక కమిటీ పరిశీలనకు పంపాలని డిమాండ్ చేశారు.

'బానిసలు అవుతారు'

దేశ జీడీపీలో 20శాతాన్ని సమకూర్చే రైతులు.. కేంద్రం ప్రతిపాదించిన బిల్లుల కారణంగా బానిసలుగా మారుతారని డీఎంకే సభ్యుడు టీకేఎస్ ఇళంగోవన్ అన్నారు. ఇవి రైతులకు మృత్యు ఘంటికలు అవుతాయని, వారిని ఒక సరకుగా మారుస్తాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

రైతు వ్యతిరేకం

కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులు రైతు వ్యతిరేకంగా ఉన్నాయని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రామ్‌గోపాల్‌ యాదవ్‌ విమర్శించారు. కార్పొరేట్ల విస్తరణకు దోహద పడేలా ఈ బిల్లులు రూపొందించారని ఆరోపించారు. ఇంత కీలకమైన బిల్లులను తీసుకొచ్చేటప్పుడు ప్రతిపక్ష నేతలు, దేశంలోని రైతు సంఘాలతో చర్చించాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు.

ఆదాయం రెట్టింపు అవుతుందా?

బిల్లుల ద్వారా రైతుల ఆదాయం రెట్టింపవుతుందని ప్రభుత్వం హామీ ఇస్తుందా? అని శివసేన ఎంపీ సంజయ్​ రౌత్ ప్రశ్నించారు. రైతులు ఇకపై ఆత్మహత్యలు చేసుకోరని హామీ ఇస్తారా? కేంద్రాన్ని అడిగారు. బిల్లుపై చర్చకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలన్నారు.

తప్పుడు ప్రచారం..

బిల్లులపై కాంగ్రెస్ తప్పుడు ప్రాచారం చేస్తోందని భాజపా నేత భూపేంద్ర యాదవ్ ఆరోపించారు. వారి 70 ఏళ్ల పాలనలో రైతుల ఆదాయం పెరిగిన దాఖలాలు లేవన్నారు. కేంద్రం తీసుకొచ్చే సంస్కరణలతో రైతులు మేలు జరుగుతుందని ఉద్ఘాటించారు. కనీస మద్దతు ధరపై ప్రభావం ఉండదని చెప్పారు.

తీవ్ర గందరగోళం

బిల్లులపై చర్చ తర్వాత రాజ్యసభలో తీవ్ర దుమారం రేగింది. బిల్లులను ఆమోదం కోసం అధికార పక్షం ప్రతిపాదన చేసేందుకు సిద్ధమవగా... విపక్షాలు వ్యతిరేకించాయి. టీఎంసీ సభ్యుడు డెరెక్ ఓబ్రయన్, ఇతర సభ్యులు వెల్ లోకి దూసుకెళ్లారు. ఫలితంగా గందరగోళం ఏర్పడగా... సభ కాసేపు వాయిదా పడింది. తిరిగి ప్రారంభమయ్యాక విపక్ష సభ్యుల నినాదాల మధ్యే వ్యవసాయ బిల్లులు ఆమోదం పొందాయి. సభ సోమవారానికి వాయిదా పడింది.

దిగువ సభ, ఎగువ సభలో గట్టెక్కిన ఈ రెండు బిల్లులు రాష్ట్రపతి ఆమోద ముద్ర లభించాక చట్ట రూపం దాల్చుతాయి.

Last Updated : Sep 20, 2020, 2:32 PM IST

ABOUT THE AUTHOR

...view details