ముస్లిం మహిళల రక్షణ కోసం రూపొందించిన వివాదాస్పద ముమ్మారు తలాక్ బిల్లును రాజ్యసభలో నేడు చర్చకు తీసుకురానుంది కేంద్రం. బిల్లును ఆమోదింపజేయాలని బలమైన లక్ష్యంతో ఉంది. ఈ మేరకు పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసింది భాజపా. మంగళవారం తప్పనిసరిగా పార్టీ ఎంపీలందరూ సభకు హాజరుకావాలని ఆదేశించింది.
ఇటీవలే తలాక్ బిల్లుకు మూజువాణి ఓటుతో లోక్‌సభలో ఆమోదం లభించింది. బిల్లుపై దిగువ సభలో చర్చ సందర్భంగా కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, డీఎమ్‌కే పార్టీలు సభ నుంచి వాకౌట్ చేశాయి.
ప్రధాని నరేంద్ర మోదీ రెండోసారి అధికారం చేపట్టిన అనంతరం పార్లమెంటు తొలి సెషన్లో లోక్‌సభ ముందుకు తీసుకువచ్చిన మొదటి బిల్లు ఇదే. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే వంటి పార్టీలు బిల్లును పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపాలని దిగువ సభలో డిమాండ్ చేశాయి. ఇందుకు సమాధానంగా లింగసమానత్వం, సామాజిక న్యాయం జరిగేలా బిల్లును రూపొందించినట్లు ప్రభుత్వం పేర్కొంది.