భారతదేశ చరిత్రలో తొలిసారి రాజ్యసభ పనిచేసిన సమయాన్ని నివేదిక రూపంలో వెల్లడించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చొరవతో ఈ పనికి పూనుకొంది రాజ్యసభ సచివాలయం. ఆయన ఆదేశాల మేరకు శాసన, పర్యవేక్షణ, నిర్వహణ ఆధారంగా నివేదికను సిద్ధం చేశారు. ఆ లెక్కల ప్రకారం ఎగువ సభ ప్రతి ఏడాది సగటున 340 గంటలు పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రజాశ్రేయస్సు కోరే అంశాలను సభలో పెట్టడం, సభ్యులు వాటిపై చర్చించడానికి రాజ్యసభ వేదికగా ఉంటుంది. అంతేకాకుండా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం, సాధారణ బడ్జెట్ సమావేశాలు, చిన్నపాటి చర్చలు, శూన్య గంట, ప్రత్యేకమైన అంశాలపై చర్చ, ఆయా శాఖల పనితీరుపై చర్చ సమయంలో ఈ సభ పనిచేస్తుంది. 100 శాతం సమయాన్ని మూడు విధాలుగా విభజిస్తే...
>> 40.20 శాతం సమయం - ప్రజా సమస్యలపై చర్చించేందుకు
>> 32.22 శాతం సమయం - జవాబుదారీతనం కోసం
>> 27.57 శాతం - చట్టాలు తయారు చేసేందుకు ఉపయోగిస్తున్నారు.
1978 నుంచి ఉన్న డేటా ఆధారంగా... సభ ఎంత సమయం పనిచేసింది? ఏఏ పనులకు ఎంత సమయం కేటాయించారు? అనే దానిపై నివేదికను తయారు చేసింది రాజ్యసభ సచివాలయం. 1978-2018 మధ్య కాలంలో.. సభ మొత్తం సమయంలో 77 శాతం సద్వినియోగం అయింది. 23 శాతం వృథా అయింది.
1978-2018 కాలంలో రాజ్యసభ పనిచేసే మొత్తం సమయాన్ని ఎలా ఉపయోగించారో శాతాల్లో నివేదికలో స్పష్టం చేశారు.
సాధారణ బడ్జెట్ సమావేశాలు కోసం (7.08 శాతం), ధన్యవాద తీర్మానంపై (4.36 శాతం), వివిధ శాఖల పనితీరుపై చర్చించేందుకు (3.93 శాతం), శూన్య గంట, ప్రత్యేక ప్రస్తావనలకు (10 శాతం), ప్రశ్నావళి కోసం (14.19 శాతం), అటెన్షన్ నోటీసులను పిలిచేందుకు (7.11 శాతం), వివిధ సమస్యలపై మంత్రుల ప్రకటనలు (6.33 శాతం), ప్రైవేట్ సభ్యుల తీర్మానాలు (3.16 శాతం), అరగంట చర్చలకు (1.25 శాతం) సమయం కేటాయించినట్లు సర్వే స్పష్టం చేసింది.