దిల్లీ ఘర్షణలపై చర్చకు విపక్షాలు పట్టుబట్టగా పార్లమెంట్ రెండో దఫా బడ్జెట్ సమావేశాలు తొలివారం సజావుగా సాగలేదు. ఉభయసభల్లో వాయిదాల పర్వం కొనసాగింది. రాజ్యసభ గతవారం కేవలం 2 గంటల 42 నిమిషాలు మాత్రమే సమావేశమైంది.
26 గంటలు వ్యర్థం..
ముందస్తు ప్రణాళిక మేరకు చర్చలు జరపడంలో రాజ్యసభ విఫలమైందని అధికారులు పేర్కొన్నారు. పెద్దలసభలో గతవారం 28.30 గంటలపాటు చర్చ జరపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే సభ ఎప్పటికప్పుడు వాయిదా పడిన కారణంగా 26 గంటల విలువైన సమయాన్ని నష్టపోయినట్లు తెలిపారు అధికారులు. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఉత్పాదకత కేవలం 9.5 శాతంగా నమోదైందని స్పష్టం చేశారు.