మోటార్ వాహనాల చట్ట సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. రాజ్యసభ ముందుకు బుధవారం బిల్లును కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తీసుకువచ్చారు. బిల్లుపై చర్చ అనంతరం జరిగిన ఓటింగ్‌లో... బిల్లుకు 108 మంది సభ్యులు మద్దతు తెలిపారు. వ్యతిరేకంగా 13 మంది ఎంపీలు ఓటేశారు.
ఈ నెల 23న లోక్‌సభలో ఆమోదం పొందగా తాజాగా ఎగువసభలోనూ ఆమోదం లభించింది. రాష్ట్రపతి ఆమోదం అనంతరం చట్ట రూపం దాల్చనుంది.
బిల్లులోని అంశాలు...
- వాహన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2.5 లక్షల పరిహారం అందజేసేలా బిల్లులో ప్రతిపాదనలు చేశారు. మోటార్ వాహనం యజమాని లేదా బీమా కంపెనీ పరిహారాన్ని అందజేసేలా ప్రతిపాదించారు.
- డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీలో భారీ మార్పులు. డీలర్ స్థాయిలోనే కొత్త వాహనాల రిజిస్ట్రేషన్.
- మద్యం తాగి వాహనం నడిపితే రూ.10 వేల జరిమానా.
- అతివేగం, డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే రూ. 2 వేల వరకు జరిమానా.
- పిల్లలకు వాహనాలు ఇస్తే యజమానిపై కేసు, వాహన రిజిస్ట్రేషన్ రద్దు.
- అత్యవసర వాహనాలకు దారి ఇవ్వకుంటే రూ.10 వేల వరకు జరిమానా.
- హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే రూ.వెయ్యి జరిమానా, మూడు నెలల లైసెన్స్ రద్దు
- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘింస్తే రూ.500 జరిమానా.
- ఓవర్ లోడింగ్‌కి రూ. 20 వేలు జరిమానా.
- ప్రమాణాలకు అనుగుణంగా వాహనాలను తయారు చేయలేకపోయిన సంస్థలపై వంద కోట్ల వరకూ పెనాల్టీ సహా ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష.