రాజ్యసభలో మంగళవారం మూడున్నర గంటల్లోనే 7 కీలక బిల్లులకు ఆమోదం లభించింది. నిత్యావసర వస్తువుల సవరణ బిల్లు, బ్యాంకింగ్ రెగ్యులేషన్ సవరణ బిల్లు సహా.. మొత్తం 7 బిల్లులను ఆమోదించింది పెద్దల సభ.
నిత్యావసర వస్తువుల సవరణ బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఈ బిల్లు చట్టంగా మారితే.. ఉల్లి, నూనెలు, పప్పులు, తృణధాన్యాలను నిత్యావసర వస్తువుల జాబితాను తొలగించవచ్చు. ఈ బిల్లును లోక్‌సభ ఈ నెల 15న ఆమోదించింది.
బ్యాంకింగ్ రెగ్యులేషన్ సవరణ బిల్లును కూడా రాజ్యసభ ఆమోదించింది. దీని ద్వారా సహకార బ్యాంకులను ఆర్బీఐ పర్యవేక్షణలోకి తీసుకురావచ్చు.
చాలా బిల్లులను పెద్దగా సభ్యుల భాగస్వామ్యం లేకుండానే ఆమోదించింది ఎగువసభ. మంత్రుల వివరణ కూడా త్వరగానే ముగిసింది.
ఎంపీలపై సస్పెన్షన్ వేటును నిరసిస్తూ.. అంతకుముందు కాంగ్రెస్, వామపక్షాలు, తృణమూల్, సమాజ్వాదీ, ఎన్సీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.
ఎగువసభ ఆమోదం పొందిన బిల్లులు..
- కొత్తగా స్థాపించిన ఐదు ఐఐఐటీలను జాతీయ ప్రాముఖ్యం కలిగిన సంస్థలుగా ప్రకటించే బిల్లు
- నిత్యావసర వస్తువుల సవరణ బిల్లు
- బ్యాంకింగ్ రెగ్యులేషన్ సవరణ బిల్లు
- జాతీయ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ బిల్లు
- రాష్ట్రీయ రక్ష యూనివర్సిటీ బిల్లు
- టాక్సేషన్ అండ్ అదర్ లాస్ బిల్లు-2020