తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాజ్యసభ ఎన్నికలకు రంగం సిద్ధం- ఆ 19 మంది ఎవరు? - పెద్దల సభ ఎన్నికలు

కరోనా వ్యాప్తి కారణంగా వాయిదాపడ్డ 19 రాజ్యసభ స్థానాలకు శుక్రవారం ఎన్నికలు జరగనున్నాయి. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే రాజకీయాలు మరోమారు వేడెక్కాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాలవారీగా అధికార, ప్రతిపక్షాల బలాబలాలను పరిశీలిస్తే...

RAJYASABHA ELECTIONS TOMMORROW
పెద్దల సభకు వెళ్లే ఆ 18 మంది ఎవరు?

By

Published : Jun 18, 2020, 5:32 PM IST

Updated : Jun 19, 2020, 7:03 AM IST

దేశమంతా కరోనా మహమ్మారితో యుద్ధం చేస్తున్న వేళ.. పలు రాష్ట్రాలు రాజ్యసభ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. అన్నీ కలిపి బరిలో ఉన్నది 19 స్థానాలే అయినా.. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం పార్టీల మధ్య పోటీ తీవ్రస్థాయిలోనే ఉంది. కర్ణాటకలో నాలుగు సీట్లు ఇప్పటికే ఏకగ్రీవమవగా.. ఎన్నికల నేపథ్యంలో రాజస్థాన్​, గుజరాత్​లో ఇప్పటికే రిసార్టు రాజకీయాలు నడిచాయి. తమ అభ్యర్థులను పెద్దలసభలో అడుగు పెట్టించేందుకు అధికార, ప్రతిపక్షాలు వ్యూహ ప్రతివ్యూహాలు రచించాయి.

పార్లమెంటు ఎగువసభలోని మొత్తం 245 స్థానాల్లో.. నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారుకు ప్రస్తుతం 106 స్థానాలు ఉన్నాయి. ప్రతిపక్షాలు 118 సీట్లతో ముందంజలో ఉన్నాయి. ఇందులో కాంగ్రెస్​ నేతృత్వంలోని యూపీఏవి 57 స్థానాలు కాగా.. ఇతర పార్టీలవి 61 సీట్లు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే కీలక బిల్లులు పార్లమెంటులో గట్టెక్కాలంటే.. సదరు బిల్లులు ఉభయసభల్లో ఆమోదం పొందాల్సి ఉంటుంది. లోక్​సభలో సొంతంగానే పూర్తి మెజారిటీ ఉన్న భాజపాకు.. రాజ్యసభలో మాత్రం బిల్లులను గట్టెక్కించాలంటే ఇతర పార్టీల మద్దతు తప్పనిసరి అవుతోంది. అందుకే జూన్​ 19న 19 స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో వీలైనన్ని సీట్లు సొంతం చేసుకుని రాజ్యసభలోనూ తమ మద్దతు పెంచుకోవాలని చూస్తోంది కమలదళం.

19 స్థానాలు ఇవే..

గుజరాత్​-4, ఆంధ్రప్రదేశ్​-4, రాజస్థాన్​-3, మధ్యప్రదేశ్​-3, ఝార్ఖండ్​-2, మణిపుర్​, మిజోరాం, మేఘాలయల్లో ఒక్కో స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు వరకు పోలింగ్​ జరుగుతుంది. అనంతరం ఓట్ల లెక్కింపు మొదలవుతుంది.

ఈ 19 స్థానాలకు మార్చి 26నే ఎన్నికలు జరగాల్సి ఉన్నా.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వాయిదా పడ్డాయి.

గుజరాత్​లో వేడెక్కిన రాజకీయాలు

భాజపా పాలిత గుజరాత్​లో.. రాజ్యసభ ఎన్నికల సందర్భంగా రిసార్టు రాజకీయాలు మొదలయ్యాయి. ఎన్నికల తేదీ ఖరారైన అనంతరం ముగ్గురు కాంగ్రెస్​ నేతలు రాజీనామా చేయడం కలకలం సృష్టించింది. దీంతో అప్రమత్తమైన కాంగ్రెస్​ పార్టీ శ్రేణులు.. ఎమ్మెల్యేలను రిసార్టుకు తరలించారు. గుజరాత్​లో మొత్తం 4 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

అసెంబ్లీలో కాంగ్రెస్​, భాజపా సంఖ్యా బలాలు

  • మొత్తం స్థానాలు : 182
  • భాజపా : 103
  • కాంగ్రెస్​ : 65
  • ఇతరులు : 4
  • ప్రస్తుతం ఖాళీగా ఉన్నవి : 10

రాజస్థాన్​లో రిసార్టు రాజకీయాలు

రాజస్థాన్​లోనూ మూడు రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరుగనున్న వేళ.. రిసార్టు రాజకీయాలు బాగానే జరిగాయి. ఎమ్మెల్యేలను భాజపా మభ్యపెడుతోందన్న ఆరోపణల మధ్య అధికార కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటికే 100 మంది శాసన సభ్యులను రిసార్టుకు తరలించింది. రాజస్థాన్​లో కాంగ్రెస్, భాజపా ఇద్దరు చొప్పున అభ్యర్థులను బరిలోకి దించాయి. అధికార పార్టీ కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్న ఇద్దరు నేతలు సునాయాసంగా గెలిచే అవకాశం ఉంది. మూడో సీటు కోసం ప్రధాన పార్టీల మధ్య పోరు జరుగుతోంది.

అసెంబ్లీలో కాంగ్రెస్​, భాజపా సంఖ్యా బలాలు

  • మొత్తం స్థానాలు : 200
  • కాంగ్రెస్​ : 107
  • భాజపా : 72
  • ఇతరులు : 21

కర్ణాటకలో ఏకగ్రీవం

కర్ణాటకలో మాజీ ప్రధాని, జేడీఎస్​ అధినేత హెచ్​డీ దేవెగౌడ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కర్ణాటక నుంచి కాంగ్రెస్ సీనియర్​​ నేత మల్లికార్జున ఖర్గే, ఇద్దరు భాజపా నేతలు కూడా పోటీ లేకుండానే రాజ్యసభకు వెళ్లనున్నారు.

కన్నడ అసెంబ్లీలో స్పీకర్‌తో కలిపి భాజపా సంఖ్యాబలం 117గా ఉంది. కాంగ్రెస్‌కు 68, జేడీఎస్‌కు 34 మంది సభ్యులున్నారు. ఒక్కో రాజ్యసభ సీటు గెలవాలంటే కనీసం 45 మంది సభ్యుల బలం కావాల్సి ఉంది. జేడీఎస్‌కు గెలిచే అవకాశం లేకపోయినప్పటికీ, ఆ పార్టీకి కాంగ్రెస్​ మద్దతుగా నిలిచింది.

ఏపీ, ఎంపీలో ఇలా...

ఆంధ్రప్రదేశ్​లోనూ 151 మంది ఎమ్మెల్యేల బలమున్న వైసీపీ.. తమ అభ్యర్థులను సునాయాసంగా రాజ్యసభకు పంపనుంది. మధ్యప్రదేశ్​లో మాత్రం భాజపా, కాంగ్రెస్​ మధ్య పోటీ రసవత్తరంగా సాగనుంది.

ఇదీ చదవండి:రాజ్యసభకు మాజీ ప్రధాని దేవెగౌడ ఏకగ్రీవ ఎన్నిక

Last Updated : Jun 19, 2020, 7:03 AM IST

ABOUT THE AUTHOR

...view details