నూతన రక్షణ ఉత్పత్తుల సేకరణ విధానాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆవిష్కరించారు. దీనివల్ల సైనిక వేదికలకు భారత్.. ప్రపంచ తయారీ కేంద్రంగా మారుతుంది. దీంతోపాటు రక్షణ ఉత్పత్తుల సేకరణ కాలం తగ్గటం సహా మూలధన బడ్జెట్ ద్వారా త్రివిధ దళాలు తమకు అత్యవసర కొనుగోళ్లకు కొత్త విధానం అనుమతిస్తుంది.
ఇతర మార్గాల ద్వారా ఆఫ్‌సెట్ బాధ్యతలను నెరవేర్చడానికి బదులు దేశంలోనే రక్షణ ఉత్పత్తులను తయారు చేసేందుకు ప్రాధాన్యం ఇవ్వడానికి మార్గదర్శకాలను కొత్త విధానంలో సవరించారు. దేశీయ రక్షణ పరిశ్రమల ప్రయోజనాలను పరిరక్షిస్తూ దిగుమతి, ఎగుమతుల కోసం తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ప్రోత్సహించే నిబంధనలను చేర్చారు. 500కోట్ల వరకు రక్షణ వస్తువుల సేకరణ ప్రతిపాదనలను ఆమోదించడంలో జాప్యాన్ని తగ్గించడానికి సింగిల్-స్టేజ్ ఒప్పందానికి నూతన విధానం అనుమతిస్తుంది.
నూతన రక్షణ ఉత్పత్తుల సేకరణ విధానాన్ని ఆవిష్కరించడంపై హర్షం వ్యక్తం చేశారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. సంబంధిత వర్గాలతో విస్తృత సంప్రదింపులు జరిపి డీఏపీని రూపొందించినట్లు తెలిపారు.