భారత్ చేరుకున్న 5 రఫేల్ యుద్ధ విమానాలు అధికారికంగా వైమానిక దళంలో చేరనున్నాయి. అందుకు సెప్టెంబర్ 10న ముహూర్తం ఖరారు చేసినట్లు అధికారవర్గాలు తెలిపాయి. హరియాణాలోని అంబాలా వైమానిక స్థావరంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్ సహా.. ఉన్నతస్థాయి సైన్యాధికారులు పాల్గొననున్నారు.
ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ. అనంతరం ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతంపై ఇరువురు రక్షణ మంత్రులు చర్చించనున్నారు. పార్లీ భారత్ పర్యటన అవకాశాలపై ఇరు దేశాల అధికారులు పలు దఫాలు చర్చించిన తర్వాతే సెప్టెంబర్ 10న ముహూర్తం ఖరారు చేసినట్లు సమాచారం.
అక్టోబర్‌లో రెండో దశ
36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో భాగంగా ఇప్పటికే ఐదింటిని భారత్ అందించింది ఫ్రాన్స్. రెండో దశలో మరో నాలుగు విమానాలు వచ్చే అక్టోబర్‌లో భారత్‌కు చేరనున్నాయని వైమానిక వర్గాలు తెలిపాయి.
2016లో ఒప్పందం..
36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు కోసం రూ. 58వేల కోట్లతో 2016లో ఫ్రాన్స్‌తో ఒప్పందం చేసుకుంది భారత్. తొలిదశలో భాగంగా ఈ ఏడాది జులై 29న అంబాలా వైమానిక స్థావరానికి 5 రఫేల్ యుద్ధ విమానాలు చేరుకున్నాయి. 36 రఫేల్ జెట్స్‌లో 30 యుద్ధ విమానాలు కాగా.. ఆరు శిక్షణ కోసం వినియోగించేవి ఉన్నాయి. రఫేల్ జెట్స్ తొలి స్వ్కాడ్రన్‌ను అంబాలా వైమానిక స్థావరంలో, రెండో స్వ్కాడ్రన్‌ను బంగాల్లోని హసిమారా స్థావరంలో ఏర్పాటు చేయనున్నారు.
ఇదీ చూడండి: భారత్‌కు రఫేల్- వాయుసేనకు కొత్త శక్తి