రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి ప్రపంచంలోనే ఎత్తయిన సైనిక స్థావరం సియాచిన్‌ను సందర్శించారు రాజ్‌నాథ్ సింగ్. అక్కడి భద్రతా పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సియాచిన్ మంచు పర్వతం వద్దకు వెళ్లి అక్కడి ఫీల్డ్ కమాండర్లు, సైనికులతో మాట్లాడారు. వారితో కలిసి అల్పాహారం చేశారు.
అనంతరం అమర జవాన్లకు నివాళులర్పించారు రక్షణ మంత్రి. ప్రమాదకర భూభాగంలో తీవ్ర ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ సైనికులు ఎంతో ధైర్యంతో దేశ భద్రతకై పాటుపడుతున్నారని కొనియాడారు. వారి ధైర్యసాహసాలకు వందనం చేస్తున్నానన్నారు. దేశ రక్షణ కోసం సియాచిన్ గ్లేసియర్‌లో 1100 మంది సైనికులు ప్రాణాలొదిలారని తెలిపారు. సైనికుల త్యాగాలను దేశం ఎన్నటికీ మరవదని పేర్కొన్నారు.