దేశంలో పరిశోధనలు, స్వేచ్ఛాయుత వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు చైనా నుంచి రాజీవ్‌గాంధీ ఫౌండేషన్ 2005-06 మధ్య విరాళాలు స్వీకరించడం ఆశ్చర్యపరిచిందని నడ్డా అన్నారు. ‘చైనా ఎంబసీ, ప్రజా గణతంత్ర చైనా నుంచి రాజీవ్ గాంధీ ఫౌండేషన్ 3 లక్షల డాలర్ల విరాళం తీసుకోవడం విస్మయపరిచింది. దేశంలో పరిశోధనలు, స్వేచ్ఛాయుత వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు ఈ నిధులు ఉపయోగించాలి. ఇక్కడ చాలా అవినీతి జరిగింది. ఈ విరాళంతో ఏయే పరిశోధనలు నిర్వహించారో కాంగ్రెస్ పార్టీ చెప్పాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.
కొవిడ్-19, గల్వాన్ లోయలో చైనాతో ఘర్షణ అంశాలపై ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పదేపదే విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ‘భారతీయ జనసంఘ్, భాజపా చాలాకాలం ప్రతిపక్షంలో ఉన్నాయి. 1962 యుద్ధం, 1965 బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో మేం కేంద్ర ప్రభుత్వానికి బాహాటంగా మద్దతిచ్చాం. కానీ కార్గిల్ యుద్ధం జరిగేటప్పుడు కాంగ్రెస్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసి దానికి హాజరవ్వలేదు’ అని నడ్డా అన్నారు.