రక్తపోటులో హెచ్చుతగ్గుల కారణంగా చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరిన అగ్రకథానాయకుడు రజనీకాంత్ చెన్నైలోని తన నివాసానికి చేరుకున్నారు. ఆయన భార్య లతా రజనీకాంత్ సూపర్‌స్టార్‌కు హారతి ఇచ్చి స్వాగతం పలికారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రజనీ త్వరగా కోలుకోవాలని అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు.
చెన్నైకి రజనీ- హారతితో భార్య స్వాగతం - చెన్నై చేరిన రజనీకాంత్
హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరిన అగ్రకథానాయకుడు రజనీకాంత్ చెన్నైలోని తన నివాసానికి చేరుకున్నారు. సూపర్‌స్టార్‌కు ఆయన సతీమణి లత.. హారతి ఇచ్చి స్వాగతం పలికారు. తలైవా.. ఆదివారం మధ్యాహ్నం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే, రజనీ త్వరగా కోలుకునేందుకు వైద్యులు కొన్ని సూచనలు చేశారు. వారం రోజుల పాటు రజనీ పూర్తి విశ్రాంతి తీసుకోవాలని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో కొవిడ్ సోకే అవకాశం ఉన్న ఏ కార్యక్రమంలోనూ పాల్గొన వద్దని సూచించారు. అదే సమయంలో ఒత్తిడిని తగ్గించుకునేందుకు చిన్న చిన్న వ్యాయామాలు చేయాలని తెలిపారు. గతంలో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్న దృష్ట్యా మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తమిళ సినిమా 'అన్నాత్తే' సినిమా షూటింగ్ కోసం ఈ నెల 13న హైదరాబాద్‌కు రజనీ వచ్చారు. షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ నెలాఖరుకల్లా షెడ్యూల్ పూర్తి చేయాల్సి ఉంది. ముందు జాగ్రత్తగా ఈనెల 22న రజనీకాంత్ కరోనా పరీక్షలు చేయించుకోగా నెగెటివ్ వచ్చింది. అప్పటి నుంచి స్వీయ నిర్బంధంలో ఉంటున్నారు. ఇంతలో శుక్రవారం ఉదయం ఒక్కసారిగా అనారోగ్యం తలెత్తడం వల్ల వెంటనే అపోలో ఆసుపత్రిలో చేరారు.
- ఇదీ చూడండి:రజనీ 'రాజకీయ' ప్లాన్ కొనసాగుతుందా?