తెలంగాణ

telangana

మార్పు మంత్రంతో రజనీ రాజకీయం- జనవరిలో ఎంట్రీ

By

Published : Dec 3, 2020, 2:02 PM IST

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయ పార్టీ ఏర్పాటుపై సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. నూతన సంవత్సరంలో రజనీ రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారు. జనవరిలో రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు రజనీకాంత్‌ స్వయంగా ప్రకటించారు. 2021 తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు వెల్లడించారు.

Rajinikanth
ఎన్నికల్లో పోటీకి రజనీ

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయ అరంగేట్రంపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. తమిళ ప్రజలు, అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తలైవా రాక ఖరారైంది. వచ్చే ఏడాది జనవరిలో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారు. ఈ మేరకు ట్విట్టర్‌ వేదికగా రజనీ ప్రకటించారు. జనవరిలో రాజకీయ పార్టీ ప్రారంభిస్తానని, అందుకు సంబంధించిన వివరాలను డిసెంబరు 31న ప్రకటిస్తానని వెల్లడించారు.

"త్వరలో జరగనున్న తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో ప్రజల ఆదరణతో గెలిచి రాష్ట్రంలో నిజాయితీ, న్యాయమైన, కులమతాలకు అతీతమైన అధ్యాత్మిక రాజకీయాలకు నాంది పలకడం నిశ్చయం. అద్భుతాలు, ఆశ్చర్యాలు జరుగుతాయి. మారుస్తాం.. అన్నింటినీ మారుస్తాం. ఇప్పుడు కాకపోతే మార్పు మరెప్పటికీ జరగదు"

- రజనీకాంత్‌ ట్వీట్

ట్వీట్​ చేసిన కాసేపటికే రజనీకాంత్​ మీడియాతో మాట్లాడారు. తన ప్రణాళికకు కరోనా వల్ల అడ్డంకులు ఏర్పడ్డాయని, అందుకే ఆలస్యమైందన్నారు. తమిళనాడు ప్రజల కోసం కష్టపడి పనిచేస్తానని స్పష్టం చేశారు.

"తమిళనాడును మార్చాల్సిన సమయం వచ్చింది. మార్పు ఇప్పుడు రాకపోతే ఎప్పటికీ రాదు. ప్రజలు నన్ను ఎంతో ప్రేమించారు. ఏదైనా ప్రజలపైనే ఆధారపడి ఉంది. నా ప్రణాళిక కరోనా వల్ల జాప్యం అయింది. మార్పు కోసం పోరాడాల్సిన సమయం వచ్చింది. రాజకీయాలను, పరిపాలనను మారుస్తాను. ప్రజల కోసం ఎంత కష్టమైనా భరిస్తా. నేను గెలిస్తే.. అది ప్రజా విజయం."

- రజనీ కాంత్​, దిగ్గజ నటుడు

కొద్ది రోజుల్లోనే..

రజనీ మక్కళ్‌ మండ్రం నిర్వాహకులతో భేటీ అయిన కొద్ది రోజులకే రజనీ ఈ ప్రకటన చేశారు.

గత సోమవారం రజనీ మక్కళ్‌ మండ్రం జిల్లా కార్యదర్శులతో రజనీ సమావేశమయ్యారు. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో వీలైనంత త్వరగా పార్టీని స్థాపించాలని కార్యదర్శులు రజనీని కోరారు. ఈ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన తలైవా.. రాజకీయ ప్రవేశంపై వీలైనంత త్వరగా నిర్ణయాన్ని ప్రకటిస్తానని తెలిపారు. అన్నట్లుగానే ఈరోజు కీలక ప్రకటన చేశారు. రజనీ రాకపై స్పష్టత రావడం వల్ల అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

వచ్చే ఏడాది జనవరిలో పార్టీ ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రజనీ పార్టీ సంచలన పరిణామాలకు కారణమయ్యే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details