రాజస్థాన్ జోధ్‌పుర్ లో ఒళ్లు గగుర్పొడిచే ఘటన వెలుగు చూసింది. భర్తను హతమార్చి శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి పడేసింది ఓ భార్య.
నెల రోజుల క్రితం జోధ్‌పుర్ నందడి గ్రామానికి చెందిన చరణ్ సింగ్ కనబడటం లేదంటూ బనాడ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. ఆగస్టు 10న సిమెంట్ ప్లాంట్ వద్ద తునాతునకలై పడిఉన్న ఓ మృతదేహం లభ్యమైంది. విచారణలో ఆ శరీర భాగాలు చరణ్వే అని తేలింది. దీంతో నలుగురు అనుమానితులను అరెస్ట్ చేశారు పోలీసులు. అనుమానితుల్లో చరణ్ భార్య సీమా, ఆమె సోదరిలు బబిత, ప్రియాంకలతో పాటు అదే గ్రామానికి చెందిన భియారామ్ ఉన్నారు.
చరణ్, సీమాలు ఏడేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. జులై 11న రాత్రి.. సీమా, తన సోదరి.. చరణ్‌ను ఓ ఖాళీ ఫ్లాట్‌కు రమ్మన్నారు. అక్కడికి చేరుకున్న చరణ్‌కు మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చారు. అది తాగిన చరణ్ స్ఫృహతప్పి పడిపోయాడు. ఆ తర్వాత భియారామ్ సాయంతో చరణ్ గొంతు నులిమి చంపేశారు. అంతటితో ఆగక.. పదునైన ఆయుధంతో ముక్కలు ముక్కలుగా నరికేశారు. ఓ గోనె సంచిలో శరీర భాగాలు వేసి.. సమీపంలోని సిమెంట్ ప్లాంట్ వద్ద ఆ సంచిని పడేసింది. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు వివరాలను వెల్లడించారు.