రాజస్థాన్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తిరుగుబాటు నేత సచిన్ పైలట్ వర్గం ఎమ్మెల్యేలపై ఈనెల 24 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేశారు రాష్ట్ర స్పీకర్ సీపీ జోషి. హైకోర్టు ఆదేశాలపై సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్(ఎస్ఎల్పీ) దాఖలు చేశారు. రాష్ట్రంలో నెలకొన్న రాజ్యాంగ సంక్షోభాన్ని నిలువరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
"షోకాజ్ నోటీసులు పంపే పూర్తి అధికారం స్పీకర్‌కు ఉంది. సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయమని మా న్యాయవాదిని కోరాను. స్పీకర్ బాధ్యతలు సుప్రీం కోర్టు, రాజ్యాంగం స్పష్టంగా నిర్వచించాయి. స్పీకర్‌గా నాకు ఓ దరఖాస్తు వచ్చింది. దానిపై సమాచారం తెలుసుకోవాలనుకునే షోకాజ్ నోటీసులు జారీ చేశాను. ఉన్న అధికారంతో నోటీసులు ఇవ్వకపోతే.. ఇకా ఆ అధికారం ఎందుకు?"
- సీపీ జోషి, రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్
నోటీసులు ఇవ్వటం అనేది స్పీకర్ బాధ్యత అని.. తీర్పుపై ఆధారపడాల్సింన అవసరం లేదన్నారు జోషి. ఇది కేవలం షోకాజ్ నోటీసేనని.. ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ఫిరాయింపుల నిరోధక చట్టం అనుసరించి స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని మారుస్తూ 1992 నుంచి ఏ కోర్టు తీర్పు వెలువరించలేదని గుర్తు చేశారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ పదవుల అధికారాలు స్పష్టంగా నిర్వచించారని.. ఎన్నికైన వారు ఆ పదవిని చేపడతారని పేర్కొన్నారు.