తెలంగాణ

telangana

By

Published : Jul 13, 2020, 5:17 AM IST

Updated : Jul 13, 2020, 6:25 AM IST

ETV Bharat / bharat

గహ్లోత్​కు టాటా చెప్పిన పైలట్.. ఏం జరగనుంది?

రాజస్థాన్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కాంగ్రెస్ సీఎం అశోక్ గహ్లోత్​పై తిరుగుబాటు బావుటా ఎగరేశారు ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్. తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలను తీసుకుని క్యాంప్ రాజకీయాలకు తెర తీశారు. పైలట్​కు 30 మందికి పైగా ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తుండగా 200 స్థానాలు గల రాజస్థాన్ అసెంబ్లీలో గహ్లోత్ గట్టెక్కుతారా అనే అంశమై సందిగ్ధం నెలకొంది.

gahloth
గహ్లోత్​కు టాటా చెప్పిన పైలట్.. ఏం జరగనుంది?

రాజస్థాన్ రాజకీయాల్లో ఉత్కంఠకర పరిణామాలు జరిగాయి. ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరుగుతోందని సీఎం అశోక్ గహ్లోత్ తెలిపిన మరుసటి రోజే తనకు 30 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు ఉందని ప్రకటించారు ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్. ఈ నేపథ్యంలో సోమవారం కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో ఏం జరగనుందనే అంశమై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే కర్ణాటక, మధ్యప్రదేశ్ తరహాలో ఇక్కడా సర్కారు పతనమవుతుందని ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి.

'మాకు 109మంది ఎమ్మెల్యేల మద్దతు'

గహ్లోత్ ప్రభుత్వం పూర్తికాలం పదవిలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత రణ్​దీప్ సుర్జేవాలా. పార్టీ అధికార ప్రతినిధి అజయ్​ మాకెన్​తో కలిసి రాజస్థాన్​కు చేరుకున్న ఆయన భాజపా సంతోషించేందుకు ఏమీ లేదని వ్యాఖ్యానించారు. సీఎం గహ్లోత్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అవినాష్ పాండేతో ఇరునేతలు సమావేశమయ్యారు. 109 మంది ఎమ్మెల్యేలు గహ్లోత్ నాయకత్వాన్ని అంగీకరిస్తూ సంతకం చేశారని, సోనియా గాంధీ, రాహుల్ గాంధీల పట్ల విశ్వాసం వ్యక్తం చేశారని పేర్కొన్నారు అవినాష్ పాండే. పార్టీ ఎమ్మెల్యేలందరూ శాసనసభాపక్ష సమావేశానికి హాజరు కావాలని విప్ జారీ చేసినట్లు చెప్పారు.

'హాజరు కాబోను..'

సోమవారం జరిగే శాసనసభాపక్ష సమావేశానికి హాజరు కాబోనని ప్రకటించారు సచిన్ పైలట్. తనకు 30 మంది కాంగ్రెస్, స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో గహ్లోత్ ప్రభుత్వం మైనారిటీలో ఉందని చెప్పుకొచ్చారు.

పైలట్‌ బలమెంత?

సచిన్‌ పైలట్‌కు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు కట్టుబడి ఉంటామని చెబుతున్నారని సమాచారం. కరోనా సంక్షోభానికంటే ముందు నుంచే సచిన్‌ భాజపాతో టచ్‌లో ఉన్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే, సీఎం పదవి ఇచ్చేందుకు కాషాయ పార్టీ సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పైలట్ సొంతంగా ప్రాంతీయ పార్టీ పెడతారన్న ఊహాగానాలూ వినిపిస్తున్నాయి. రాజస్థాన్‌లో 200 స్థానాలకు గానూ కాంగ్రెస్‌కు 107 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. 12 మంది స్వతంత్రులు, మరో ఐదుగురు ఇతర పార్టీ సభ్యులు ప్రభుత్వానికి మద్దతిస్తున్నారు. వాస్తవంగా సచిన్‌ వెంట ఉన్నది ఎందరు? ప్రభుత్వం నిలుస్తుందా? వంటి ప్రశ్నలకు కొన్ని గంటల్లో సమాధానం రానుంది.

ఆ నోటీసే కొంపముంచిందా..?

రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు జరుగుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో సచిన్‌ పైలట్‌కు ఇటీవల స్పెషల్‌ ఆపరేషన్‌ గ్రూప్‌ (ఎస్‌వోజీ) పోలీసుల నుంచి నోటీసులు అందినట్లు తెలుస్తోంది. దీనిపై జరుగుతున్న విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. ఈ నోటీసే సచిన్‌ను తీవ్ర అసంతృప్తికి గురిచేసినట్లు ఆయన మద్దతు వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ లేఖతో సచిన్‌ విషయంలో ముఖ్యమంత్రి తన పరిధి దాటి వ్యవహరించినట్లు వారంతా భావిస్తున్నట్లు సమాచారం.

ఇదీ చూడండి:సచిన్​ 'పవర్'​ ప్లే- రాజస్థాన్​ దారెటు?

Last Updated : Jul 13, 2020, 6:25 AM IST

ABOUT THE AUTHOR

...view details