రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న వేళ కీలక వ్యాఖ్యలు చేశారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్. త్వరలోనే జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో తమ ప్రభుత్వం మెజారిటీ నిరూపించుకుంటుందని వెల్లడించారు. అనంతరం కొద్ది గంటల్లోనే గవర్నర్ కల్రాజ్ మిశ్రాతో భేటీ అయ్యారు గహ్లోత్. ఈ భేటీలో శాసనసభ సమావేశాలపై చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
" త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. మాకు పూర్తి మెజారిటీ ఉంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఐకమత్యంతో ఉన్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేల్లోని కొందరు సమావేశాలకు హాజరవుతారని నమ్మకముంది. వారు లేకపోయినా.. మాకు పూర్తి మెజారిటీ ఉంటుంది. ఆ మెజారిటీతోనే సభకు వెళుతున్నాం. అక్కడే నిరూపించుకుంటాం. "
- అశోక్ గహ్లోత్, రాజస్థాన్ ముఖ్యమంత్రి.
ఫోరెన్సిక్‌కు పంపాం..
ఆడియో టేపుల విషయంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌పై పరోక్ష విమర్శలు చేశారు ముఖ్యమంత్రి గహ్లోత్. పేరు చెప్పకుండానే.. స్వర నమూనాలు ఇచ్చేందుకు ఆయన ఎందుకు ముందుకు రావట్లేదని ప్రశ్నించారు. ఆడియో టేపులను ఫోరెన్సిక్ పరీక్షల కోసం విదేశాలకు పంపించామని తెలిపారు. టేపులు కల్పితమైనవి అనే వాదనలను తోసిపుచ్చారు గహ్లోత్. వాటిని పరీక్షించేందుకు ఏ ఫోరెన్సిక్ ల్యాబ్కైనా పంపేందుకు సిద్ధమని సవాల్ విసిరారు.
ఈడీ సోదాలపై విమర్శలు..
ఎరువుల ఎగుమతుల కుంభకోణం అంశంలో గహ్లోత్ సోదరుడి ఇంటిలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించటంపై విమర్శలు చేశారు సీఎం. కేంద్ర సంస్థలు మోదీ, అమిత్ షా ఆదేశాల మేరకు పని చేస్తున్నాయని ఆరోపించారు. అలాంటి వాటికి తాము భయపడబోమని, తమ పని తాము చేసుకుంటూ ముందుకు వెళతామని స్పష్టం చేశారు గహ్లోత్.
ఇదీ చూడండి: 'కేంద్రమంత్రే ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రయత్నించారు'