రాజస్థాన్‌లో రాజకీయాలు ఉత్కంఠకర మలుపులు తిరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఆరోపించిన మరుసటి రోజే ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ కొంతమంది శాసనసభ సభ్యులతో దిల్లీ వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యమంత్రి తనను తప్పించే ప్రయత్నం చేస్తున్నారంటూ సచిన్ పైలట్ ఇప్పటికే కాంగ్రెస్ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. తాజాగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని సోనియా గాంధీతోపాటు రాహుల్‌ను కలిసి వివరించనున్నట్లు సమాచారం. తమకు దాదాపు 23 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని సచిన్ వర్గం చెబుతోంది. సీఎం అశోక్ గహ్లోత్ మద్దతుదారులు మాత్రం సచిన్ పైలట్ భారతీయ జనతా పార్టీకి సన్నిహితంగా మెలుగుతున్నట్లు ఆరోపిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని చేజిక్కించుకున్నట్లుగానే రాజస్థాన్‌లోనూ ఆ పార్టీ పావులు కదుపుతోందని విమర్శిస్తున్నారు.
పార్టీ నేతలతో సీఎం భేటీ..
సచిన్ పైలట్ తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి దిల్లీ వెళ్లిన వేళ రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్.. జైపుర్‌లో రాత్రి 9 గంటలకు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ భేటీకి మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న స్వతంత్ర ఎమ్మెల్యేలు రావాలని సమన్లు జారీ చేశారు.
అంతర్గత కలహాలే కారణం..