గత కొద్ది రోజులుగా రాజస్థాన్ కోటాలోని జేకే లాన్ ప్రభుత్వాసుపత్రిలో చిన్నారులు మృతి చెందుతున్నారు. ఆదివారం మరో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో గత వారంలో ఇక్కడ మరణించిన శిశువుల సంఖ్య 14 కు చేరింది. కేవలం డిసెంబరు నెలలోనే ఈ ఆసుపత్రిలో 91 మంది చిన్నారులు మృతిచెందగా.. ఈ ఏడాది వీరి సంఖ్య 940గా ఉంది.
శిశు మరణాలపై కోటా ఎంపీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ట్విట్టర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై రాజస్థాన్ ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ కూడా ఈ మరణాలపై తీవ్రంగా స్పందించారు. శిశు మరణాలపై రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శి వైభవ్ గాల్రియా నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. 48 గంటల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
'అపరిశుభ్రతే'-దర్యాప్తు నివేదిక
ఆసుపత్రి మౌలిక సదుపాయాల్లో అనేక లోపాలున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేల్చింది ముగ్గురు సభ్యుల కమిటీ. చిన్నారులను ఉంచే నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్(నవజాత శిశు విభాగం)లో సరిపడా ఆక్సిజన్ ఉండట్లేదని గుర్తించింది. ఆసుపత్రి ఆవరణ అపరిశుభ్రతతో మునిగి తేలుతోందని, పందులు స్వైర విహారం చేస్తున్నట్లు ఎన్సీపీసీఆర్ పేర్కొంది. విరిగిన తలుపులు,కిటికీలు, సిబ్బంది కొరతతో ఆసుపత్రి సమస్యల సుడిలో ఉన్నట్లు దర్యాప్తులో స్పష్టం చేసింది.
వైద్య పరికరాలు తక్కువే
వైద్యానికి అవసరమైన పరికరాలు కూడా ఆసుపత్రిలో అంతంతమాత్రంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడి మౌలిక సదుపాయాలపై జాతీయ శిశు హక్కుల కమిషన్ ఎన్సీపీసీఆర్ చేసిన దర్యాప్తులో ఆశ్చర్యపోయే నిజాలు బహిర్గతమయ్యాయి.