తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సచిన్​ పైలట్​ వ్యాజ్యంపై నేడు విచారణ - congress latest news

స్పీకర్​ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సచిన్ పైలట్​​ వర్గం దాఖలు చేసిన వ్యాజ్యంపై నేడు విచారణ చేపట్టనుంది రాజస్థాన్​ హైకోర్టు. ఈ వ్యాజ్యాన్ని గురువారం రాత్రి 7:30గంటలకు విచారించాల్సి ఉన్నప్పటికీ.. నేటికి వాయిదా పడింది. పార్టీ జారీ చేసే విప్‌ శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడే వర్తిస్తుందని పైలట్‌ వర్గం ఎమ్మెల్యేలు వాదిస్తున్నారు.

rajasthan high court to hear sachin pilots plea
సచిన్​ పైలట్​ వ్యాజ్యంపై నేడు విచారణ

By

Published : Jul 17, 2020, 5:24 AM IST

రాజస్థాన్‌లో రాజకీయ దుమారం మలుపులు తిరుగుతోంది. ఎమ్మెల్యేలపై తనకున్న పట్టును ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ రుజువు చేసుకున్నా, సచిన్‌ పైలట్‌ వర్గంపై కాంగ్రెస్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్పీకర్‌ జారీచేసిన నోటీసులు వివాదాన్ని రేపుతున్నాయి. వీటిని సవాల్‌ చేస్తూ పైలట్‌ వర్గీయులు గురువారం రాజస్థాన్‌ హైకోర్టును ఆశ్రయించారు. పూర్తిస్థాయి విచారణ శుక్రవారం జరగనుంది. పార్టీ జారీ చేసే విప్‌ శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడే వర్తిస్తుందనేది పైలట్‌ వర్గం ఎమ్మెల్యేల వాదన. నోటీసులో పేర్కొన్న ప్రకారం శుక్రవారం లోగా వారంతా స్పీకర్‌కు సమాధానాలు ఇవ్వాల్సి ఉంది.

డివిజన్‌ బెంచ్‌కు నివేదన

పైలట్‌, మరో 18 మంది కలిసి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ తొలుత విచారణ చేపట్టారు. కొంత సమయం ఇస్తే తాజా పిటిషన్‌ దాఖలు చేస్తామని పైలట్‌ తరఫున న్యాయవాది హరీశ్‌సాల్వే కోరారు. న్యాయమూర్తి ఆమోదంతో దానిని దాఖలు చేశారు. పిటిషన్‌ను ఇద్దరు సభ్యుల డివిజన్‌ బెంచ్‌ రాత్రి 7.30 గంటలకు విచారిస్తుందని జస్టిస్‌ శర్మ ప్రకటించారు. అయితే ధర్మాసనం చివరకు విచారణను శుక్రవారం మధ్యాహ్నానికి వాయిదా వేసింది. తన వాదన కూడా ఆలకించాల్సిందిగా కాంగ్రెస్‌ చీఫ్‌ విప్‌ మహేశ్‌ జోషి.. న్యాయస్థానాన్ని కోరారు. స్పీకర్‌ కార్యాలయం తరఫున అభిషేక్‌ మనుసింఘ్వి, పైలట్‌ శిబిరం తరఫున హరీశ్‌ సాల్వేతో పాటు ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించనున్నారు. స్పీకర్‌ పంపిన నోటీసులు రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ కిందికి రావనీ, పైలట్‌ వర్గంలో ఉన్నవారెవరూ వేరే పార్టీలో చేరడం గానీ, భాజపాకి మద్దతు ఇవ్వడం గానీ చేయలేదని రాజ్యాంగ చట్టాల నిపుణుడైన న్యాయవాది రాకేశ్‌ ద్వివేది విశ్లేషించారు. సభా కార్యకలాపాల వరకే విప్‌ వర్తిస్తుందని స్పష్టంచేశారు.

వేటు పడితే గహ్లోత్‌కు లాభమే

19 మంది శాసనసభ్యులపై అనర్హత వేటుపడితే రాజస్థాన్‌ శాసనసభలో సభ్యుల బలం 200 నుంచి 181కి తగ్గిపోతుంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సభ్యుల సంఖ్య తదనుగుణంగా 91 అవుతుంది. అప్పుడు గహ్లోత్‌ పని మరింత సులభమవుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇంతవరకు అధికార పార్టీకి 13 మంది స్వతంత్రులు, ఇతర పార్టీలకు చెందిన ఐదుగురు మద్దతు ఇస్తున్నారు. నోటీసులు అందుకున్న 19 మందిని తీసేసినా కాంగ్రెస్‌ సొంత సభ్యులు 88 మంది ఉంటారు. అందువల్ల ఇతరుల మద్దతుతో బలపరీక్షలో ఒడ్డున పడడం కష్టం కాదంటున్నారు.

తలుపులు తెరిచి ఉంచిన కాంగ్రెస్‌!

కాంగ్రెస్‌ అగ్రనాయకత్వం మాత్రం పైలట్కు పార్టీ తలుపులు తెరిచే ఉన్నాయంటోంది. పార్టీలోకి తిరిగి రావాలంటే తన షరతులేమిటో దక్షిణాదికి చెందిన ఒక సీనియర్‌ నేతకు పైలట్‌ వివరించినట్లు సమాచారం.యువనేతపై ఎలాంటి తీవ్ర వ్యాఖ్యలు చేయవద్దంటూ గహ్లోత్‌ను అధిష్ఠానం కోరింది. పైలట్‌ను వదులుకునేందుకు రాహుల్‌గాంధీ సిద్ధంగా లేరని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇదీ చూడండి: ఐరాస వార్షిక సమావేశంలో నేడు మోదీ ప్రసంగం

ABOUT THE AUTHOR

...view details