రాజస్థాన్లో అధికార పార్టీ శాసనసభ్యులను భాజపా మభ్యపెట్టేందుకు యత్నిస్తోందన్న ఆరోపణల మధ్య ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తతతో వ్యవహరిస్తోంది. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ సహా 100 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దిల్లీ- జైపుర్ రహదారిలో ఉన్న ఓ రిసార్టులో రాత్రంతా బస చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎమ్మెల్యేలకు ఇతర పార్టీలు ఎరవేసే అవకాశం ఉన్నందున వారందరినీ రిసార్టులోనే ఉండాలని పార్టీ ఆదేశించినట్లు స్పష్టం చేశాయి.
ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ సహా కీలక నేతలతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్. తమ ఎమ్మెల్యేలంతా ఐకంగానే ఉన్నారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ తరపున రాజ్యసభ బరిలో ఉన్న ఇద్దరు అభ్యర్థులు సునాయాసంగా విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
"రాజ్యసభ ఎన్నికలు రెండు నెలల క్రితమే నిర్వహించాల్సింది. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను భాజపా కొనుగోలు చేయడం పూర్తి కాలేదు కాబట్టే ఎన్నికలను వాయిదా వేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఒక్క ఓటు కూడా ఇతర పార్టీల అభ్యర్థులకు పడదు. ఇద్దరు సీపీఎం ఎమ్మెల్యేల మద్దతు మాకు ఉంది. "