రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదలైన అనిశ్చితి నేపథ్యంలో సోమవారం సీఎల్పీ భేటీ నిర్వహించనుంది పార్టీ. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ నివాసం ఉదయం 10.30 గంటలకు సమావేశం ఉంటుందని రాజస్థాన్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి అవినాశ్ పాండే స్పష్టం చేశారు.
ఈ భేటీ తర్వాత పార్టీ సీనియర్ నేతలు రణ్‌దీప్ సుర్జేవాలా, అజయ్ మాకెన్ సమక్షంలో మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ మేరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ హాజరు కావాలని పార్టీ విప్ జారీ చేసింది. భేటీకి హాజరుకానివారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.
మాకు మద్దతు ఉంది..
రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదని పాండే తెలిపారు. తమకు 109 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని స్పష్టం చేశారు. అశోక్ గహ్లోత్‌తో ఫోన్లో మాట్లాడిన మరో నలుగురు ఎమ్మెల్యేలు తమకు మద్దతు ఇస్తామని ప్రకటించినట్లు వెల్లడించారు.
ఏం జరిగింది?
రాజస్థాన్‌లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. సీఎం గహ్లోత్‌పై తిరుగుబాటు బావుటా ఎగరేశారు ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్. తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలను తీసుకుని క్యాంప్ రాజకీయాలకు తెర తీశారు. పైలట్‌కు 30 మందికి పైగా ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తుండగా 200 స్థానాలు గల రాజస్థాన్ అసెంబ్లీలో గహ్లోత్ గట్టెక్కుతారా అనే అంశమై సందిగ్ధం నెలకొంది.
ఇదీ చూడండి:గహ్లోత్‌కు టాటా చెప్పిన పైలట్.. ఏం జరగనుంది?