రాజస్థాన్‌లో అశోక్ గహ్లోత్ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ చేస్తున్న బుజ్జగింపు ప్రయత్నాలు కొలిక్కిరావడం లేదు. మంగళవారం మరోసారి నిర్వహించిన సీఎల్పీ భేటీకి ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్‌తో పాటు ఆయన వర్గం హాజరు కాలేదు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ, అహ్మద్ పటేల్, చిదంబరం, కేసీ వేణుగోపాల్ వంటి నేతలు సచిన్ పైలట్‌తో పలుమార్లు మాట్లాడినా ఫలితం లేకపోయింది. కాంగ్రెస్ అధిష్ఠానం సచిన్‌తో చర్చించేందుకు సుముఖంగా ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అయితే సీఎల్పీ భేటీ అనంతరం తదుపరి కార్యాచరణపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ సంక్షోభం సమయంలో కాంగ్రెస్‌కు మిత్రపక్షమైన భారతీయ ట్రైబల్ పార్టీ(బీటీపీ) తటస్థంగా ఉండాలని నిర్ణయించింది. బీటీపీకి ఇద్దరు శాసనసభ్యులు ఉండగా వారు ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి వర్గాలకు దూరంగా ఉండనున్నట్లు పార్టీ తెలిపింది.