కరోనా వ్యాప్తి సమయంలోనూ మలుపులు తిరిగిన రాజస్థాన్ రాజకీయం సుఖాంతానికి చేరుకున్నట్లే కనిపిస్తోంది. వివాదానికి కేంద్ర బిందువైన తిరుగుబాటు నేత సచిన్ పైలట్, ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్.. కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం సాక్షిగా చిరునవ్వులు చిందిస్తూ కరచాలనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో నేటి నుంచి జరిగే రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాల్లో విశ్వాస పరీక్షకు అధికార కాంగ్రెస్ సిద్ధమైంది.
విశ్వాస పరీక్షపై సీఎల్పీ భేటీలో చర్చించినట్లు ఎమ్మెల్యేలంతా సీఎం గహ్లోత్ నేతృత్వంలో పనిచేస్తామని ప్రమాణం చేసినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అవినాశ్ పాండే తెలిపారు. ఇప్పటివరకు జరిగింది మర్చిపోవాలని భేటీలో అశోక్ గహ్లోత్ చెప్పినట్లు సమావేశానికి హాజరైన నేతలు తెలిపారు.తమ 19 మంది ఎమ్మెల్యేలుు లేకుండా బలం నిరూపించుకోవడం సంతోషంగా ఉండకపోయేదని గహ్లోత్ వ్యాఖ్యానించిట్లు మరో నేత అన్నారు. ఈ క్రమంలో అసెంబ్లీలో విశ్వాస పరీక్షకు వెళ్తున్నట్లు గహ్లోత్ చెప్పారని, ఎవరి ఫిర్యాదులైనా వారు కోరినప్పుడు పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.
మరోవైపు తాను పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సహకరించినందుకు పైలట్ కృతజ్ఞతలు చెప్పారని మరో ఎమ్మెల్యే తెలిపారు. కాంగ్రెస్ ఆదేశాలను పాటిస్తానని పైలట్ అన్నట్లు వెల్లడించారు. సమావేశం అనంతరం కాంగ్రెస్ పార్టీ ఐకమత్యంతో భాజపా చెడు రాజకీయాలపై పోరాడుతుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అన్నారు.
అటు... బహుజన్ సమాజ్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేల విలీన అంశంపై ప్రస్తుతం తాము ఎలాంటి జోక్యం చేసుకోబోమని సుప్రీం కోర్టు స్పష్టంచేసింది. మరోవైపు.. నేటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో గహ్లోత్ సర్కారుపై అవిశ్వాస తీర్మానం పెట్టనున్నట్లు ప్రతిపక్ష భాజపా ప్రకటించింది. గురవారం జరిగిన పార్టీ సమావేశంలో ఆ పార్టీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు వసుంధరా రాజే.. గవర్నర్ కల్‌రాజ్ మిశ్రాను కలిశారు. ఇరువురు నేతలు మర్యాదపూర్వకంగా కలిసినట్లు రాజస్థాన్ రాజ్‌భవన్ తెలిపింది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో రాజే గవర్నర్‌ను కలవడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
ఇదీ చూడండి: 'దేశంలో కరోనా కేసుల సూచీ భయపెడుతోంది'