ఎన్నికల ప్రచారంలో నేతలెవరైనా ప్రజలను ఏమని అభ్యర్థిస్తారు? తమ పార్టీని గెలిపించాలని, అధికారం కట్టబెట్టాలనే కదా! మహారాష్ట్రలో ఓ నేత మాత్రం తమ పార్టీని ప్రతిపక్షంలో ఉంచాలని కోరుతూ అందరినీ విస్తుపరుస్తున్నారు. ఆయనే రాజ్ ఠాక్రే. తనదైన విలక్షణ శైలితో నిత్యం అందరి దృష్టిని ఆకర్షిస్తుండే ఆయన తాజా ఎన్నికల్లో చేస్తున్న ప్రచారం అదేరీతిలో ఉంది. ఆయన చెప్పినట్లుగానే బహుశా ఇంతవరకు ఇలాంటి అభ్యర్థన ఎవరూ చేసి ఉండరేమో.!!
ముంబయిలో ఇటీవల నిర్వహించిన ఓ ప్రచారసభలో రాజ్ ఠాక్రే తన పార్టీ ఎంఎన్‌ఎస్‌ను ప్రతిపక్షంగా నిలపాలంటూ ప్రజలను కోరారు. 'ప్రస్తుత పరిస్థితుల్లో గట్టి ప్రతిపక్షం అవసరం. అధికార పార్టీ భాజపాలో నాయకులను మాట్లాడనివ్వడం లేదు. అలాంటప్పుడు ప్రజలు, ప్రజాసమస్యల కోసం ఎవరు పోరాడుతారు? అలా పోరాడే ప్రతిపక్షంలో ఉండే అవకాశం ఇవ్వండి' అని ఆ సభలో రాజ్ పేర్కొన్నారు. అంతేకాకుండా దేశంలో ఇంతవరకు ఇలాంటి అభ్యర్థన ఎవరూ చేసి ఉండరని కూడా అన్నారు. మహారాష్ట్రలో భాజపా, శివసేన కూటమి తిరిగి అధికారంలోకి వస్తుందన్న అంచనాలున్నాయి. మరోవైపు పోటీ ఇవ్వాల్సిన కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ)లు అంతర్గత సమస్యలతో సతమతమవుతున్నాయి. దీంతో బలమైన ప్రతిపక్షం ఏర్పడేందుకు చోటుందన్న భావనతోనే రాజ్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎంఎన్‌ఎస్‌ని ప్రజల నోట్లో నానేలా చేయాలన్నది రాజ్ ఆలోచనగా రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అదే బలం.. బలహీనత!
మహారాష్ట్రలో కీలకంగా ఉండే ఠాక్రే కుటుంబానికి చెందిన రాజ్ ఠాక్రేది ప్రత్యేకశైలి. శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే సోదరుడి కుమారుడైన రాజ్ వ్యాఖ్యలు ఎప్పుడూ విలక్షణంగానే ఉంటాయి. బాల్ ఠాక్రేను గుర్తుకు తెచ్చేలా ఆయన ఆహార్యం ఉంటుంది. 2006లో శివసేనతో వేరుపడి అందరినీ ఆశ్చర్యపరిచిన రాజ్ ఠాక్రే తర్వాత మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్) పేరిట సొంతంగా పార్టీ పెట్టారు. ఆయన మంచి వక్త.అద్భుతంగా ప్రసంగాలిస్తారు. అయితే రాజ్ వాగ్ధాటి ఎంఎన్‌ఎస్‌కు బలహీనతగా మారిందని అంటుంటారు. టీవీ ఛానెళ్లలో, మీడియాతో అద్భుతంగా మాట్లాడే రాజ్ మిగతా సమయంలో కనిపించరన్న అభిప్రాయం ఉంది.
నాటి నుంచి నేటి వరకు..
ఎంఎన్‌ఎస్ పార్టీ ఏర్పాటైన మూడేళ్లకే.. 2009లో జరిగిన ఎన్నికల్లో 13 అసెంబ్లీ స్థానాలను సాధించి మహారాష్ట్రలో నాలుగో పెద్ద పార్టీగా అవతరించింది. అప్పట్లో అది విశేషంగానే చెప్పుకొనేవారు. 2012లో ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆ పార్టీ 27 స్థానాలు సాధించింది. అదే ఏడాది 45 స్థానాలతో నాసిక్ కార్పొరేషన్‌లో అధికారంలోకి వచ్చింది. దీంతో తనకు ఒక్కసారి అధికారం ఇవ్వాలని, పరిస్థితులన్నింటినీ చక్కదిద్దుతానని రాజ్ ఠాక్రే ప్రజలను అభ్యర్థిస్తూ వచ్చారు. ఆ తర్వాత ఎంఎన్‌ఎస్ పార్టీ పూర్తి గడ్డు స్థితిలోకి వెళ్లిపోయింది. ముంబయి కార్పొరేషన్ తదుపరి ఎన్నికల్లో ఒకేఒక్క కౌన్సిల్ స్థానం దక్కగా.. నాసిక్‌లో అసలు ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ మద్దతిచ్చిన స్వతంత్ర అభ్యర్థి ఒకరు మాత్రమే గెలుపొందారు. దీంతో అనూహ్యంగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయరాదని ఆ పార్టీ నిర్ణయించింది. తాజా ఎన్నికల్లో 104 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్న ఎంఎన్‌ఎస్ ఏమేరకు నెట్టుకొస్తుందో చూడాలి.
ఇదీ చూడండి: 'రాష్ట్రాన్ని పాలిస్తారా లేక భోజనం తయారుచేస్తారా?'