భారీ వర్షాలు, వరదలు ఉత్తరాది రాష్ట్రాలను వణికిస్తున్నాయి. వరదల ధాటికి హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో 28 మంది మరణించారు. మరో 22 మంది ఆచూకీ గల్లంతైంది. దిల్లీ, హరియాణా, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌లను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి.
పంజాబ్ ,హరియాణా
పంజాబ్‌లో భారీ వర్షాల దాటికి ఓ ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. గురుదాస్‌పుర్ జిల్లాలో బియాస్ నదిలో కొట్టుకుపోతున్న 9 మందిని విపత్తు నిర్వహణ దళం సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది.
యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఫలితంగా హరియాణా ప్రభుత్వం హతినికుండ్ జలాశయం నుంచి 8.14 లక్షల క్యూసెక్ల నీటిని కిందకు విడిచిపెట్టింది. ప్రమాదం పొంచి ఉన్నందున సహాయకచర్యల కోసం సైన్యం సిద్ధంగా ఉండాలని కోరింది.
హిమాచల్‌ప్రదేశ్
వరదల్లో చిక్కుకుని... హిమాచల్‌ప్రదేశ్‌లో ఇద్దరు నేపాలీలు సహా 22 మంది మరణించారు. 9 మంది గాయపడ్డారు. బియాస్, సట్లెజ్ నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న కారణంగా పండోహ్, నాథ్పా జాక్రీ డ్యామ్‌ల నుంచి నీటిని కిందకు విడిచిపెట్టారు. సిమ్లా-కల్కల మధ్య పలు చోట్ల కొండ చరియలు విరిగిపడటం వల్ల రైలు సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది. పరిస్థితి ఇంకా ప్రమాదకరంగానే ఉందన్న కారణంతో పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు.
ఉత్తరాఖండ్‌లో ముగ్గురు మరణించగా, 22 మంది ఆచూకీ కోల్పోయారు. దిల్లీ
యమున నదిలో నీటిమట్టం 203.37 మీ.లకు చేరుకుంది. ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దిల్లీని వరదలు ముంచెత్తవచ్చని... లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ప్రభుత్వం హెచ్చరించింది.