కేరళలో మరోసారి వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో 9 జిల్లాల్లో జల ప్రళయం కొనసాగుతోంది. ఈ విధ్వంసంలో 22 మంది మృతి చెందారు. నదులు, వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. చాలా చోట్ల భారీగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ ఘటనల్లో 200 మందికిపైగా గాయాలయ్యాయి.
కొండచరియలతో ప్రమాదం
వానలతో వాయనాడ్ జిల్లా పూర్తిగా అతలాకుతలం అయింది. మెప్పాడీలో రెండు కొండల మధ్య ప్రాంతం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఎర్నాకులం జిల్లాలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న మువత్తుపుళా నది వందల ఇళ్లను నీట ముంచేసింది.
ఇడుక్కి జిల్లా పన్నియార్ నదిపై ఉన్న పొన్ముడి ఆనకట్టకు భారీగా వరద నీరు చేరటం వల్ల జలాశయం 81 శాతం నిండిపోయింది. రాత్రి నీటిని వదలనున్న నేపథ్యంలో దిగువన ఉన్న ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేసింది ప్రభుత్వం.
పరిమితికి మించి ప్రవహిస్తున్న కుట్టంపూళా నదిని దాటుతుండగా రెండు ఏనుగులు మునిగిపోయాయి. కొన్ని కిలోమీటర్ల వరకు నదిలోనే కొట్టుకుపోతూ ఓ చోట ఒడ్డుకు చేరుకుని అడవిలోకి వెళ్లిపోయాయి.
కొచ్చి విమానాశ్రయం మూసివేత
కొచ్చి విమానాశ్రయం పూర్తిగా నీట మునిగింది. రన్వే పైనా నీరు చేరుకోవటం వల్ల విమాన రాకపోకలను అధికారులు నిలిపివేశారు. విమానాశ్రయంలో ప్రయాణికులు చిక్కుకున్నట్లు సమాచారం. ఆదివారం వరకు ఎయిర్పోర్టును మూసివేశారు. గతేడాది ఆగస్టు వరదల సమయంలో పక్షం రోజులు కొచ్చి విమానాశ్రయాన్ని మూసివేశారు.
వాణిజ్య అవసరాల నిమిత్తం భారత నావికాదళ విమానాశ్రయాన్ని తెరిచారు అధికారులు. ఎర్నాకులం, కాయంకుళం, అలెప్పీ మార్గాల్లో రైలు సేవలను నిలిపివేశారు.
సహాయక చర్యలు ముమ్మరం
రాష్ట్రంలో వరదల నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ఎన్డీఆర్ఎఫ్, సైన్యం రంగంలోకి దిగింది. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి 22 వేల మందిని తరలించారు. 9 జిల్లాల్లో 315 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు.
సీఎం సమీక్ష
రాష్ట్రంలో వరదల విధ్వంసంపై సీఎం పినరయి విజయన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. తక్షణ సహాయార్థం రూ.22 కోట్లను విడుదల చేశారు. సహాయక చర్యల కోసం సైన్యం, వాయుసేన సాయాన్ని కోరారు. ఉత్తరాది జిల్లాల్లో వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు విజయన్.
ఇదీ చూడండి: వరద గుప్పిట్లో కేరళ.. 22కు చేరిన మృతులు