పండుగ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో మరిన్ని ప్రత్యేక రైళ్లను నడిపేందుకు భారతీయ రైల్వే సిద్ధమైంది. అక్టోబర్ 20 (నేటి) నుంచి నవంబర్ 30 మధ్య మొత్తం 196 రూట్లలో 392 రైలు సర్వీసులను నడపనుంది. ప్రస్తుతం నడుస్తున్న రైళ్లకు ఇవి అదనం.
దసరా నవరాత్రులతో పాటు దీపావళి, ఉత్తరాదిన ప్రత్యేకంగా జరిగే ఛఠ్ పూజ లాంటి పండుగలు వరుసగా ఉన్న కారణంగా ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉంది. ఈ కారణంతో ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించినట్లు భారతీయ రైల్వే తెలిపింది. అయితే, ఈ రైళ్ల టికెట్ ధరలు.. తరగతులను అనుసరించి 10 నుంచి 30 శాతం పెంచనుంది.
భద్రతపై సమీక్ష..
కరోనా నేపథ్యంలో స్టేషన్లు, రైళ్లలో తీసుకోవాల్సిన చర్యలు, భద్రత వంటి అంశాలపై రైల్వే బోర్డు ఛైర్మన్ గతవారంలో సమీక్ష నిర్వహించారు.
సికింద్రాబాద్, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, చెన్నై, మధురై, తిరువనంతపురం, కన్యాకుమారి, కోల్‌కతా, పట్నా, వారణాసి, లఖ్నవూ, గయ, జైపుర్, పూరీ, భువనేశ్వర్ సహా పలు స్టేషన్ల నుంచి ఈ స్పెషల్ ట్రైన్లు నడుస్తాయని రైల్వే శాఖ వెల్లడించింది.